పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు మరో స్కామ్‌ దెబ్బ

PNB declares Rs 2,060 cr fraud at IL and FS Tamil Nadu Power - Sakshi

వెలుగులోకి రూ.2,060 కోట్ల మోసపూరిత రుణ ఖాతా

రూ.824 కోట్ల కేటాయింపులు

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) వరుస దెబ్బలను ఎదుర్కొంటోంది. రూ.2,060 కోట్ల భారీ రుణ ఖాతాను మోసపూరితమైనదిగా గుర్తించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తమిళనాడు పవర్‌ ఖాతాను నిరర్థక రుణ ఖాతా (ఎన్‌పీఏ)గా ప్రకటించింది. ఢిల్లీ జోనల్‌ ఆఫీస్‌ పరిధిలోని ‘ఎక్స్‌ట్రా లార్జ్‌ కార్పొరేట్‌ బ్రాంచ్‌’ పరిధిలో ఇది జరిగినట్టు తెలిపింది. ఈ ఖాతాకు సంబంధించి ఆర్‌బీఐకి రిపోర్ట్‌ చేసినట్టు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ఆర్‌బీఐ నిబంధనలను అనుసరించి ఈ ఖాతాకు రూ.824 కోట్ల కేటాయింపులు చేసినట్టు పేర్కొంది.

పీఎన్‌బీ కంటే ముందే పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకు.. ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తమిళనాడు పవర్‌ ఖాతాను మోసపూరితమైనదిగా ప్రకటించడం గమనార్హం. రూ.148 కోట్ల రుణాన్ని ఎన్‌పీఏగా ప్రకటించి ఆర్‌బీఐకి సమాచారం ఇచ్చింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌) ఏర్పాటు చేసిన ప్రత్యేక  సంస్థే (ఎస్‌పీవీ) ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తమిళనాడు పవర్‌. తమిళనాడులోని కడలోర్‌లో థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల అమలుకు దీన్ని ఏర్పాటు చేసింది.  

మూడు విభాగాలు...
నిర్ణీత కాలవ్యవధిలోపు రుణ చెల్లింపులు రాని ఖాతాలను ఎన్‌పీఏగా గుర్తించి ఆర్‌బీఐకి తెలియజేయాల్సి ఉంటుంది. ఎస్‌ఎంఏ–0 విభాగం కింద ఖాతాలను డిఫాల్ట్‌ కేసుగా పరిణిస్తారు. 30రోజులుగా అసలు, వడ్డీ చెల్లింపులు చేయని ఖాతాలు ఈ విభాగం కిందకు వస్తాయి. బకాయి మొత్తాన్ని చెల్లించి పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఎంఎస్‌ఏ–1 విభాగం కింద 31–60 రోజులుగా చెల్లింపులు చేయని (పూర్తిగా/పాక్షికంగా) ఖాతాలను చేరుస్తారు. దివాలా, బ్యాంక్రప్టసీ కోడ్‌ కింద పరిష్కార చర్యలను బ్యాంకులు చేపడతాయి. ఎస్‌ఎంఏ–3 కింద 61–90 రోజులుగా చెల్లింపులు చేయని ఖాతాలు వస్తాయి. ఈ ఖాతాలను బ్యాంకులు ఎన్‌సీఎల్‌టీ ముందుకు తీసుకెళతాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top