మోదీ వార్నింగ్‌తో వణికిన మార్కెట్లు | PM Narendra Modi call for austerity shakes country and stock market | Sakshi
Sakshi News home page

మోదీ వార్నింగ్‌తో వణికిన మార్కెట్లు

May 13 2026 1:24 AM | Updated on May 13 2026 1:24 AM

PM Narendra Modi call for austerity shakes country and stock market

రెండు రోజుల్లో రూ. 16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి

క్రూడ్‌ సెగ, మార్కెట్‌ పతనంతో పాతాళానికి రూపాయి  

ప్రధాని మోదీ పొదుపు చర్యల పిలుపుతో దేశంలోప్రకంపనలు

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో క్రూడ్‌ ధర మరింత పైపైకి

నేడోరేపో పెట్రో ధరల మోత ఖాయమంటున్న పరిశీలకులు

మోదీ సూచనలతో ఉపశమనం తాత్కాలికమేననే అభిప్రాయాలు

వినియోగం తగ్గితే ఆర్థిక వృద్ధికి దెబ్బ తప్పదంటున్న నిపుణులు

స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్టర్లకు దిక్కుతోచని పరిస్థితి...

బంగారం కొనాలా వద్దా అని సామాన్య ప్రజల్లో ఆందోళన

కొనుగోళ్లను తగ్గించేందుకు దిగుమతి సుంకాలు పెంచే చాన్స్‌

(సాక్షి, బిజినెస్‌): ‘ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి. పెట్రోల్, డీజిల్‌ వాడకం తగ్గించుకోవడానికి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయండి. ఎలక్ట్రిక్‌ వాహనాలను, ప్రజా రవాణాను మరింతగా ఉపయోగించుకోండి. వంట నూనెలు, ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోండి. విదేశీ వస్తువులు వద్దు... స్వదేశీయే ముద్దు’ అంటూ ప్రధాని మోదీ తాజాగా ఎత్తుకున్న పొదుపు రాగంతో మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. ఇరాన్‌ యుద్ధ ప్రభావంతో చమురు రేట్లు భారీగా ఎగబాకటం.. రూపాయి విలువ పాతాళానికి జారిపోతుండటం.. ద్రవ్యోల్బణం సెగలు రేగటంతో ఇప్పటికే దేశీ స్టాక్‌ మార్కెట్లలో ‘బేర్‌’ బాజా మోగుతోంది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మోదీ పొదుపు సూచనలతో ప్రజల వినిమయం పడిపోయి జీడీపీ వృద్ధికి చిల్లు పడొచ్చని ఆర్థిక నిపుణుల వార్నింగ్‌లు మొదలయ్యాయి. ఇవన్నీ కలిసి మార్కెట్లను వణికిస్తుండటంతో గత రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి కావడం ఇన్వెస్టర్లను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది.  

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ముడిచమురు, బంగారం, ఎరువులతో సహా అనేక కమోడిటీల ధరలు ఇప్పటికే భారీగా ఎగిశాయి. ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడిన భారత్‌పై దీని ప్రభావం తీవ్రంగా పడింది. ముడి చమురు రేటు 100 డాలర్ల పైకి దూసుకెళ్లడంతో దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతోంది. డాలర్లను అధికంగా వెచ్చించాల్సి రావడంతో మన చేతి ‘చమురు’ వదులుతోంది. విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయి. దీంతో రూపాయి ఇంకా పడిపోతోంది. మన దిగుమతుల్లో దాదాపు మూడో వంతు వాటా క్రూడ్, పసిడి, ఎరువులు, వంటనూనెలదే కావడంతో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే మోదీ వీటి కొనుగోళ్లు, వాడకాన్ని తగ్గించేందుకు పొదుపు మంత్రాన్ని జపించారు. ఎకానమీలో నెలకొన్న బలహీనతలకు ఇది అద్దం పడుతోందన్నది నిపుణుల మాట. 

మార్కెట్లకు షాక్‌...: మోదీ సూచనలను జరగబోయే పరిణామాలకు వార్నింగ్‌గా భావించిన మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. రెండు రోజుల్లో సెన్సెక్స్‌ దాదాపు 3,000 పాయింట్లు, నిఫ్టీ 800 పాయింట్లకు పైగా కుప్పకూలాయి. సోమవారం రూ.6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరికాగా, మంగళవారం మరో రూ.10 లక్షల కోట్లు ఎగిరిపోయాయి. మోదీ సూచనల ప్రభావానికి తోడు ఇరాన్‌తో సీజ్‌ఫైర్‌ గాల్లో దీపమంటూ.. ట్రంప్‌ చేసిన ప్రకటనతో మడిచమురు ధరలు భగ్గుమనడం ఈ మార్కెట్‌ పతనానికి ప్రధాన కారణం. గోల్డ్‌ రిటైల్‌ సంస్థలు, ట్రావెల్, వినియోగ వస్తువుల షేర్లు వరుసగా రెండో రోజూ పడిపోవడం గమనార్హం. 

పసిడి కొనుగోళ్లపై గందరగోళం... 
బంగారాన్ని ఏడాది పాటు కొనొద్దంటూ స్వయంగా మోదీయే చెప్పడంతో జనానికి ఏం చేయాలో తోచని పరిస్థితి ఎదురైంది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో తులం రూ.1.85 లక్షల ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయిని తాకిన పుత్తడి. ఇప్పుడు రూ.1.5 లక్షల స్థాయిలో ఉంది. అంతర్జాతీయంగానూ ఔన్స్‌ 5,600 డాలర్లను తాకి ప్రస్తుతం 4,600 డాలర్ల వద్ద ఉంది. అయితే, రూపాయి మారకం విలువ భారీగా క్షీణించడంతో దేశీయంగా పసిడి రేట్లు పెద్దగా దిగిరాలేదు. భారతదేశ మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా దాదాపు 9 శాతం. మనం వినియోగించే బంగారంలో దిగుమతుల వాటా ఏకంగా 90 శాతం. అంటే ఏటా 700–800 టన్నులు. దీనికి భారీగా డాలర్లు వెచ్చించాల్సి రావటంతో మన ఫారెక్స్‌ నిల్వలకు గండి పడుతోంది. 

గడిచిన రెండు నెల్లల్లో దాదాపు 38 బిలియన్‌ డాలర్లు తగ్గి మన నిల్వలు 690.69 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. ఇది రూపాయి పతనాన్ని పెంచుతోంది. దీనికి అడ్డకట్టవేయడానికే మోదీ పొదుపు మంత్రం ఎత్తుకున్నారు. కాకపోతే రేటు మరింత పెరిగితే కొనలేమేమోనన్న ఆందోళనలో ఉన్న సామాన్యుల్లో ప్రధాని ప్రకటన గందరగోళాన్ని పెంచింది. యుద్ధం మళ్లీ తీవ్రమైతే బంగారం దూసుకెళ్లే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అందుకే కొనుగోళ్లకు బ్రేక్‌ వేసేందుకు అవసరమైతే దిగుమతి సుంకాన్ని (ప్రస్తుతం 6 శాతం) కూడా ప్రభుత్వం పెంచవచ్చన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా చేస్తే బంగారం రేట్లు దేశీయంగా మరింత భగ్గుమంటాయి. మరోపక్క, పసిడి కొనుగోళ్లను నిరుత్సాహపరిస్తే ఆభరణాల పరిశ్రమపై ప్రభావం పడి, లక్షల మంది ఉపాధి కోల్పోవచ్చన్న ఆందోళనలూ ఉన్నాయి.
 
క్రూడ్‌ పైపైకి.. త్వరలో పెట్రో వాత! 
కాల్పుల విరమణ తర్వాత కాస్త శాంతించిన క్రూడ్‌ రేట్లు మళ్లీ యుద్ధ భయాలతో భగ్గుమన్నాయి. మంగళవారం బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 109 డాలర్లను తాకింది. చమురు సెగతో ఎఫ్‌ఎంసీజీతో సహా ఇప్పటికే దేశీయంగా పలు ఉత్పత్తుల ధరలు ఎగబాకుతున్నాయి. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు రోజుకు దాదాపు రూ.1,700 కోట్ల ఆదాయ నష్టాల నేపథ్యంలో నేడోరోపో పెట్రో వాత ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. మోదీ రెండు రోజుల క్రితం జపించిన పొదుపు మంత్రం నేపథ్యంలో బుధవారం జరిగే కేంద్ర కేబినెట్‌ భేటీలో ఏం నిర్ణయాలు తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది. పెట్రో రేట్లను పెంచితే ద్రవ్యోల్బణం మరింత ఎగబాకి, వడ్డీ రేట్ల పెంపునకు దారితీస్తుందని.. ఎకానమీ మరింత మందగమనంలోకి జారిపోతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. మోదీ పొదుపు సూచనలు ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక ఉపశమనాన్నే ఇస్తాయని.. క్రూడ్‌ రేట్లు 100 డాలర్ల పైన ఎక్కువ కాలం ఉంటే జీడీపీ వృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్‌తో సహా పలు రేటింగ్‌ ఏజెన్సీలు ఈ ఏడాది వృద్ధి రేటుకు కోత వేయటం తెలిసిందే. 6– 6.5 శాతానికే వృద్ధి పరిమితమవుతుందన్న అంచనాల నేపథ్యంలో మోదీ పొదుపు పిలుపు ప్రభావంతో 6 శాతం కిందికి పడిపోవచ్చని విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. 

రూపాయి విలవిల.. 
ఇరాన్‌ యుద్ధం మొదలైనప్పటి నుంచీ రూపాయి జారుడుబల్లపైనే ఉంది. చమురు రేట్ల దెబ్బతో దిగుమతుల బిల్లు పెరగటం దీనికి ప్రధాన కారణం. మరోపక్క, విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) స్టాక్‌ మార్కెట్ల నుంచి పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకోవడం కూడా దేశీ కరెన్సీని వణికిస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా ఏకంగా రూ.2 లక్షల కోట్ల విలువైన షేర్లను ఎఫ్‌పీఐలు విక్రయించడం గమనార్హం. 2025 చివర్లో డాలర్‌తో 90 స్థాయిలో ఉన్న రూపాయి... ఇపుడు 95కి చేరింది. ఏడాది కాలంలో దాదాపు 10 శాతం క్షీణించింది. ఈ ఏడాది ఆసియాలో దారుణంగా పడిపోయిన కరెన్సీ మనదే. కాగా, మంగళవారం మరో 40 పైసలు పడ్డ రూపాయి.. సరికొత్త ఆల్‌టైమ్‌ కనిష్టమైన 95.68కి జారిపోయింది. రూపాయి ఇలా పతనమవటం దిగుమతుల బిల్లు మరింత పెరిగేలా చేస్తోంది. ఎందుకంటే దిగుమతుల కోసం డాలర్ల రూపంలో చెల్లించడానికి మనం మరిన్ని రూపాయలు ఖర్చు చేయాలి కదా!!. 

ఎరువులు, వంట నూనెల మంట! 
యుద్ధం కారణంగా హోర్ముజ్‌ జలసంధిలో రవాణా ఆగిపోవటంతో దేశంలో ఎరువుల రేట్లకు రెక్కలొస్తున్నాయి. మన యూరియా దిగుమతుల్లో 75 శాతం గల్ఫ్‌ దేశాల నుంచే వస్తున్నాయి. ఇక డీఏపీ దిగుమతుల్లో సౌదీ వాటా 40 శాతం. 2025–26లో భారత్‌ ఏకంగా 14.5 బిలియన్‌ డాలర్ల విలువైన ఎరువులను దిగుమతి చేసుకుంది. ఇప్పుడు సరఫరాపరమైన ఇక్కట్లు.. రూపాయి తీవ్ర పతనంతో ఈ దిగుమతులు మరింత భారమై, దేశీయంగా రేట్లు ఎగబాకుతున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌కు సమాయత్తమవుతున్న రైతులు రేట్ల పెరుగుదలకు తోడు తగినంత సరఫరా ఉంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. మరోపక్క, వంటింట్లో వంటనూనెల మంట మండుతోంది. భారత్‌ వంటనూనెల అవసరాల్లో 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. 2025–26లో 19.5 బిలియన్‌ డాలర్ల విలువైన వంటనూనెలను దిగుమతి చేసుకుంది. రూపాయి వాతతో దేశీయంగా రేట్లు ఇప్పటికే భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఎరువులు, వంట నూనెల వాడకాన్ని తగ్గించుకోవాలంటూ మోదీ పిలుపునివ్వడం గమనార్హం.   

Advertisement
 
Advertisement
Advertisement