హైదరాబాద్‌కు ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’

Plug And Play Announces its first center in India At Hyderabad - Sakshi

డిసెంబర్‌ తొలివారంలో కార్యకలాపాల ప్రారంభానికి దిగ్గజ సంస్థ నిర్ణయం

మొబిలిటీ, ఐఓటీ రంగాల్లో స్టార్టప్‌లకు ఇక మరింత ఊతం

పారిస్‌లో మంత్రి కేటీఆర్‌ బృందంతో పీఅండ్‌పీ ప్రతినిధుల భేటీ  

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల వేదికగా పేరొందిన ‘ప్లగ్‌ అండ్‌ ప్లే టెక్నాలజీ సెంటర్‌’అతిత్వరలో హైదరాబాద్‌లో అడుగుపెట్టనుంది. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో జరుగుతున్న ‘యాంబిషన్‌ ఇండియా–2021’సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కె.తారకరామారావు నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందంతో ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ప్రతినిధులు భేటీ అయ్యారు. డిసెంబర్‌ తొలివారంలో తమ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో సయీద్‌ అమీది మంత్రి కేటీఆర్‌ సమక్షంలో హైదరాబాద్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభిస్తారని ఈ భేటీ అనంతరం వారు ప్రకటించారు.

మొబిలిటీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, వ్యవసాయ సాంకేతికత, ఆరోగ్యం, ట్రావెల్, ఫిన్‌టెక్‌ తదితర రంగాలపై ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే కేంద్రం ద్వారా తొలుత మొబిలిటీ, ఐఓటి, విద్యుత్, మౌలిక వసతుల వాతావరణంపై దృష్టి పెట్టి తర్వాతి దశలో ఫిన్‌టెక్, జీవ ఔషధ, ఆరోగ్య రంగాలకు కార్యకలాపాలు విస్తరిస్తామని సంస్థ ప్రకటించింది. 


ఐఓటీ, స్మార్ట్‌ సిటీస్‌ రంగంలో ఇంక్యుబేషన్‌ 
జర్మనీలోని ‘స్టార్టప్‌ ఆటోబాన్‌’తరహాలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ఆవిష్కరణల కేంద్రాన్ని (ఇంక్యుబేషన్‌ సెంటర్‌) కూడా నూతన సాంకేతిక భాగస్వామ్యాలకు చిరునామాగా రికార్డు సమయంలో పీఎన్‌పీ (ప్లగ్‌ అండ్‌ ప్లే) తీర్చిదిద్దనుంది. మొబిలిటీ రంగంలో పేరొందిన సంస్థలు, స్టార్టప్‌ల భాగస్వామ్యంతో ‘స్టార్టప్‌ ఆటోబాన్‌’అతితక్కువ సమయంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఇదే తరహాలో సియాటిల్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘ట్రయాంగ్యుల్‌ ల్యాబ్స్‌’ అనే సంస్థ భాగస్వామ్యం తో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే టెక్నాలజీ సెం టర్‌ ఐఓటీ, స్మార్ట్‌ సిటీస్‌ రంగాల్లో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను పీఅండ్‌పీ నడపనుంది.

స్టార్టప్‌లు, కార్పొరేట్‌ పెట్టుబడిదారులకు భారత్‌లో అతిపెద్ద, అత్యుత్తమ టెక్నాలజీ సెంటర్‌ను నిర్మించడమే తమ  లక్ష్యంగా ఉంటుందని ïకేటీఆర్‌తో భేటీ అనంతరం పీఅండ్‌పీ ప్రతినిధి బృందం వెల్లడించింది. పీఅండ్‌పీ బృందం భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, పారిస్‌లోని ఫ్రెంచ్‌ సెనేట్‌ చీఫ్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ అమర్‌నాథ్‌రెడ్డి ఆత్మ కూరి పాల్గొన్నారు. ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ నెట్‌వర్క్‌ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 35 వేలకుపైగా స్టార్టప్‌లు, 530కిపైగా సంస్థలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. 1,500కుపైగా యాక్టివ్‌ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులతో ఇప్పటివరకు వెంచర్‌ ఫండింగ్‌లో 9 బిలియన్‌ డాలర్లకుపైగా రాబట్టింది. 

భారతీయ సంస్థలకు పీఅండ్‌పీ ముఖద్వారం: కేటీఆర్‌ 
ప్రముఖ సంస్థలతో కలసి భారతీయ స్టార్టప్‌లు అంతర్జాతీయ స్థాయికి ఎదగడంలో ప్లగ్‌ అండ్‌ ప్లే (పీఅండ్‌పీ) ముఖద్వారంగా పనిచేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. భారతీయ స్టార్టప్‌లు అభివృద్ధి చేసే ఆవిష్కరణలు, సాంకేతికతను అంతర్జాతీయంగా బదిలీ చేసేందుకు పీఅండ్‌పీ రాక దోహదం చేస్తుందన్నారు. తమ నెట్‌వర్క్‌ పరిధిలోని వెంచర్‌ క్యాపిటలిస్ట్‌లకు భారతీయ స్టార్టప్‌లను పీఎన్‌పీ పరిచయం చేస్తుందన్నారు.

ఇప్పటికే భారత్‌లో అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ ‘టీ–హబ్‌’ను కలిగి ఉన్న తెలంగాణకు పీఅండ్‌పీ రాక మరింత ఊతమిస్తుందన్నారు. మొబిలిటీ రంగంలో ఆవిష్కరణలు అత్యంత కీలకమని, ఇ ప్పటికే ఈ రంగంలో పలు అంతర్జాతీయ సంస్థల తో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్య ఒప్పందా లు కుదుర్చుకుందన్నారు. హెల్త్‌కేర్, ఐఓటీ, ఎన ర్జీ, ఫిన్‌టెక్‌ వంటి రంగాల్లో పురోగతి సాధిస్తున్న తెలంగాణకు పీఅండ్‌పీ రాక మరింతగా ఉపయోగపడుతుందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top