పెట్రోల్‌ 118 నాటౌట్‌.. డీజిల్‌ 104 నాటౌట్‌.. గ్యాప్‌ లేకుండా బాదుతున్న చమురు సంస్థలు

Petrol Desiel Prices Hiked Again - Sakshi

సామాన్యులపై కనీస కనికరం చూపకుండా ధరలు పెంచుకుంటూ పోతున్నాయి చమురు కంపెనీలు. తాజాగా లీటరు, పెట్రోలు, డీజిల్‌లపై 80 పైసల వంతున ధరను పెంచాయి. వీటికి డీలర్‌ కమిషన్‌, వ్యాట్‌ తదితర అంతా కలిపితే లీటరు పెట్రోలు ధర 91 పైసలు, డీజిల్‌ ధర 87 పైసలు పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర 118.59కి పెరగగా లీటరు డీజిల్‌ ధర రూ.104.62కి చేరుకుంది. 

రూ.10కి పైగా
ఉదయం ఆరు గంటలు అయ్యిందంటే చాలు పెట్రోలు రేట్లు ఎప్పుడు పెంచుదామా అన్నట్టుగా చూస్తున్నాయి చమురు కంపెనీలు. గడిచిన పదిహేను రోజుల వ్యవధిలో కేవలం రెండంటే రెండే రోజులు గ్యాప్‌ ఇచ్చి పదమూడు సార్లు ధరలను సవరిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ సవరణల కారణంగా లీటరు పెట్రోలు ధర గత రెండు వారాల్లోనే రూ.10.39 పెరగగా డీజిల్‌ ధర రూ. 10.57లు పెరిగింది.

ఉపశమనం లేదు
అంతర్జాతీయ మార్కెట్‌ రేట్లకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్‌ రేట్లను సవరిస్తున్నట్టు చమురు సంస్థలు ప్రకటిస్తున్నాయి. ఎన్నికలు పెట్రోలు రేట్లకు సంబంధం లేదని కేంద్ర మంత్రులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. 2022 మార్చి 21న అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 111.83 డాలర్లుగా ఉండగా ఏప్రిల్ 5న 109.41 డాలర్ల వద్ద ఉంది. ఐనప్పటికీ ధరల పెంపు నుంచి సామాన్యులకు ఉపశమనం లభించడం లేదు. 

ఎన్నికలుంటేనే
2021 మేలో బెంగాల్‌ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి పెట్రోలు వాతలు మొదలయ్యాయి. ఈ పరంపర 2021 నవంబరు 4 వరకు కొనసాగింది. ఈ దెబ్బకు దేశవ్యాప్తంగా లీటరు పెట్రోలు, డీజిల్‌ ధర వంద దాటేసింది. దీంతో ప్రజా వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కేంద్రం లీటరు పెట్రోలు, డీజిల్‌ ధరలను రూ.5 వంతున తగ్గించింది. ఆ తర్వాత ఉత్తర్‌ ప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చేశాయి.

నాటౌట్‌
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం 2021 నవంబరు 4 నుంచి 2022 మార్చి 22 వరకు దాదాపు 137 రోజుల పాటు పెట్రోలు, డీజిల్‌ రేట్లను పెంచలేదు. ఇక మార్చి 22న మొదలైన చమురు సంస్థల బాదుడు నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఈ దెబ్బకు లీటరు పెట్రోలు 118 నాటౌట్‌, డీజిల్‌ 104 నాటౌట్‌ బ్యాటింగ్‌ అన్నట్టుగా పరిస్థితి మారింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top