ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న ‘పెర్ప్లెక్సిటీ’ టెక్ ప్రపంచంలో మరో సంచలనానికి తెరలేపింది. మాక్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ‘పర్సనల్ కంప్యూటర్’ అనే సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను కంపెనీ అధికారికంగా ప్రారంభించింది. ఇది కంప్యూటర్‌లోని ఫైళ్లు, అప్లికేషన్లతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే ఒక ఏఐ ఏజెంట్ అని కంపెనీ తెలిపింది.
మల్టీ-మోడల్ ఆర్కెస్ట్రేషన్
ఫిబ్రవరిలో కంపెనీ పరిచయం చేసిన ‘పెర్ప్లెక్సిటీ కంప్యూటర్’ అధునాతన ఆర్కెస్ట్రేషన్ ఫీచర్లను ఇప్పుడు నేరుగా యూజర్ల పర్సనల్ కంప్యూటర్లలో తీసుకువచ్చారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కంప్యూటర్‌లోని లోకల్ ఫైల్స్, ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు, వెబ్ కంటెంట్‌ను ఒకే చోట అనుసంధానిస్తుంది. సంక్లిష్టమైన పనులను పూర్తి చేయడానికి ఈ సాఫ్ట్‌వేర్ ఏకకాలంలో మల్టీ ఏఐ ఏజెంట్లను రంగంలోకి దించుతుంది.
మాక్ మినీతో నిరంతర సేవలు
ఈ సాఫ్ట్‌వేర్ అత్యంత ఆకర్షణీయమైన అంశం దాని ‘రిమోట్ యాక్సెస్’ సామర్థ్యం. ఒకవేళ మీరు మాక్ మినీలో ఈ సాఫ్ట్‌వేర్‌ను రన్ చేస్తుంటే అది 24/7 అందుబాటులో ఉంటుంది. మీరు ఇంటి బయట ఉన్నప్పుడు కూడా మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా వాయిస్ కమాండ్స్ ఇచ్చి మీ కంప్యూటర్‌లోని పనులను పూర్తి చేయవచ్చు లేదా పర్యవేక్షించవచ్చు.
పర్సనల్ కంప్యూటర్ చేసే పనులు ఇవే..
ఈ ఏఐ అసిస్టెంట్ కేవలం సమాధానాలు చెప్పడమే కాకుండా క్రియేటివ్ పనులను కూడా చక్కబెడుతుంది.
మీ 'టూ-డూ లిస్ట్' సమీక్షించి పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తుంది. యాపిల్ నోట్స్ లేదా మెసేజెస్ వంటి యాప్‌లను తెరిచి మీకు కావాల్సిన సమాచారాన్ని పంపడం లేదా నోట్స్ సిద్ధం చేయడం వంటివి చేస్తుంది. అస్తవ్యస్తంగా ఉన్న ఫోల్డర్‌లను క్రమబద్ధీకరించడం, ఫైళ్లకు అర్థవంతమైన పేర్లు పెట్టడం వంటి పనులను క్షణాల్లో పూర్తి చేస్తుంది.
మొబైల్ నుంచే వాయిస్ ద్వారా పనులను పూర్తి చేసే వెసులుబాటు ఉంది.
భద్రతే ప్రాధాన్యం
వినియోగదారుల డేటా భద్రత విషయంలో పెర్ప్లెక్సిటీ కఠినమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. ‘పర్సనల్ కంప్యూటర్ అప్లికేషన్ అత్యంత సురక్షితమైన ‘శాండ్‌బాక్స్’ వాతావరణంలో పనిచేస్తుంది. ఇది చేసే ప్రతి చర్యను యూజర్లు పర్యవేక్షించవచ్చు. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే మార్పులు చేసే సదుపాయం కూడా ఉంది’ అని కంపెనీ స్పష్టం చేసింది.
ప్రస్తుతానికి ఈ ‘పర్సనల్ కంప్యూటర్’ ఫీచర్ పెర్ప్లెక్సిటీ ప్రో చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. వెయిట్‌లిస్ట్‌లో ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూ త్వరలోనే సాధారణ వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి!


