టెక్ ప్రపంచాన్ని కుదిపేసిన ‘ఓపెన్ ఏఐ’ హైడ్రామాపై ఎట్టకేలకు తెర వీడింది. సరిగ్గా రెండేళ్ల క్రితం సంస్థ సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్‌ను అర్ధరాత్రి పూట సీఈఓ పదవి నుంచి తొలగించడం, ఆపై వారం రోజుల్లోనే ఆయన మళ్లీ పగ్గాలు చేపట్టడం వెనుక జరిగిన ఆసక్తికర పరిణామాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. ఎలాన్ మస్క్ దాఖలు చేసిన తాజా కోర్టు కేసు విచారణలో భాగంగా అప్పటి తాత్కాలిక సీఈఓ మీరా మురాటి, సామ్ ఆల్ట్‌మాన్ మధ్య జరిగిన అంతర్గత సందేశాలు బయటపడ్డాయి. ఈ సందేశాలు ఆనాటి గందరగోళాన్ని కళ్లకు కడుతున్నాయి.
అసలేం జరిగింది? బోర్డు ఆరోపణలేంటి?
నవంబర్ 17, 2023న ఓపెన్‌ఏఐ బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. సామ్ ఆల్ట్‌మాన్‌పై నమ్మకం పోయిందని పేర్కొంటూ ఆయనను పదవి నుంచి తొలగించింది. లాభాపేక్ష లేని సంస్థ లక్ష్యాలకు ఆల్ట్‌మాన్ శైలి విరుద్ధంగా ఉందని బోర్డు భావించింది.
మీరా మురాటి వ్యాఖ్యలు
ఆల్ట్‌మాన్ వెళ్లిపోయిన వెంటనే అప్పటి సీటీఓ మీరా మురాటిని తాత్కాలిక సీఈఓగా బోర్డు నియమించింది. ఆ సమయంలో సామ్ ఆల్ట్‌మాన్ తిరిగి రావడానికి ప్రయత్నిస్తూ.. పరిస్థితి ఎలా ఉందని మీరాను ఆరా తీసినట్లు చెప్పారు. ఆల్ట్‌మాన్ ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన విషయాలు చెబుతూ సంస్థలో గందరగోళం సృష్టించారని మురాటి అన్నారు. తదుపరి సీఈఓ ఎవరనే విషయాలు కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు.
రక్షకుడిగా నిలిచిన సత్య నాదెళ్ల
ఓపెన్‌ఏఐలో బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెట్టిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఈ సంక్షోభం సమయంలో చాకచక్యంగా వ్యవహరించారు. బోర్డు మొండిగా వ్యవహరిస్తున్న తరుణంలో ఆల్ట్‌మాన్, ఆయన బృందాన్ని మైక్రోసాఫ్ట్‌లో చేర్చుకుంటున్నట్లు ప్రకటించి ఒక్కసారిగా సీన్ మార్చారు. ‘సామ్ ఆల్ట్‌మాన్, గ్రెగ్ బ్రోక్‌మ్యాన్ మా కొత్త అడ్వాన్స్‌డ్ ఏఐ పరిశోధన బృందానికి నాయకత్వం వహించడానికి మైక్రోసాఫ్ట్‌లో చేరుతున్నారు’ అని సత్య నాదెళ్ల ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈ ఒక్క ప్రకటనతో దాదాపు 90 శాతం మంది ఓపెన్‌ఏఐ ఉద్యోగులు ఆల్ట్‌మాన్ వెంట నడుస్తామని రాజీనామా లేఖలు సిద్ధం చేశారు. సంస్థ కుప్పకూలిపోతుందని భయపడిన బోర్డు, చివరకు తలొగ్గి ఆల్ట్‌మాన్‌ను తిరిగి సీఈఓగా ఆహ్వానించింది. ఇదిలాఉండగా, ప్రస్తుతం మీరా మురాటి ఓపెన్‌ఏఐ నుంచి తప్పుకుని ‘థింకింగ్ మెషిన్స్ ల్యాబ్’ అనే సొంత సంస్థను స్థాపించారు.
ఇదీ చదవండి: భయం వద్దు.. నైపుణ్యమే హద్దు


