
పెట్టుబడులపై బాహాటంగా సిఫార్సులు ఇస్తున్న వారు 33 శాతం మంది
ప్రశ్నార్థకంగా విశ్వసనీయత, జవాబుదారీతనం
సీఎఫ్‌ఏ ఇనిస్టిట్యూట్ నివేదిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లు, ఇతరత్రా పెట్టుబడులపై రిటైల్ మదుపరుల మీద ఫిన్‌ఫ్లుయెన్సర్లు చూపిస్తున్న ప్రభావం అంతా ఇంతా కాదు. సరైన అర్హతలు, తగిన అనుమతులు లేకుండా వారిచ్చే ఆర్థిక సలహాలను పట్టుకుని ఇన్వెస్ట్ చేస్తూ, ఎంతో మంది నష్టాల పాలవుతున్నారు. ఫిన్‌ఫ్లుయెన్సర్లపై అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొఫెషనల్స్ సంస్థ సీఎఫ్‌ఏ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారి వివరాల ప్రకారం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద నమోదు చేసుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు (ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు) రెండు శాతమే ఉన్నారు.
కానీ 33 శాతం మంది బాహాటంగానే క్రయ, విక్రయాలకు సంబంధించిన రికమెండేషన్లు ఇస్తున్నారు. దీంతో సదరు సలహాల విశ్వసనీయతపైనా, ఇన్‌ఫ్లుయెన్సర్ల జవాబుదారీతనంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫిన్‌ఫ్లుయెన్సర్ల సానుకూల, ప్రతికూల ప్రభావాలు, పరిణామాలను తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ సర్వేలో 51 మంది ప్రముఖ ఫిన్‌ఫ్లుయెన్సర్ల తీరును లోతుగా విశ్లేషించారు. ఇందులో 1,600 మంది ఇన్వెస్టర్లు పాల్గొన్నారు.
‘‘ఆర్థిక అంశాలపై అవగాహన పెంచేందుకు దేశీయంగా ఫిన్‌ఫ్లుయెన్సర్ వ్యవస్థ ద్వారా ఎంతో చేయడానికి ఆస్కారం ఉంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు బాధ్యతాయుతమైన విధానాలను పాటించడం, పూర్తి సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఫిన్‌ఫ్లుయెన్సర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సెబీ వద్ద రిజిస్టర్ చేసుకున్న అడ్వైజర్ల నుంచే పెట్టుబడులకు సంబంధించిన గైడెన్స్ తీసుకోవాలి. తాము ఫాలో అయ్యే ఇన్‌ఫ్లుయెన్సర్ల వివరాలను ధృవీకరించుకోవాలి’’ అని సీఎఫ్‌ఏ ఇనిస్టిట్యూట్–ఇండియా కంట్రీ హెడ్ ఆరతి పోర్వాల్ తెలిపారు.
నివేదికలోని మరిన్ని వివరాలు..
→ 21 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సున్న యువ ఇన్వెస్టర్లు ఒక క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేయడం లేదు. పొదుపు రూపంలో కాస్త చెప్పుకోతగిన మొత్తాన్ని పోగేసుకునే వరకు వేచి చూస్తున్నారు. వయస్సులో పెద్దవారైన ఇన్వెస్టర్లు మాత్రం నెలవారీగా ఇన్వెస్ట్ చేయడంలో స్థిరమైన విధానాలను పాటిస్తున్నారు.
→ విశ్వసనీయత, ఉపయోగించడానికి సులభతరంగా ఉండటమనేవి ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోవడంలో కీలకాంశాలుగా ఉంటున్నాయి. యువ ఇన్వెస్టర్లు తక్కువ బ్రోకరేజీ ఉండే ప్లాట్‌ఫామ్‌లను ఎంచుకుంటుండగా, కాస్త సీనియర్లు ఫుల్–సర్వీస్ బ్రోకరేజీలను, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా గైడెన్స్ ఇచ్చే ఫ్లాట్‌ఫామ్‌లను ఎంచుకుంటున్నారు.
→ సంక్లిష్టమైన ఆర్థికాంశాలను ఇన్‌ఫ్లుయెన్సర్లు సరళంగా వివరిస్తున్నప్పటికీ, తమకు ఒనగూరే ప్రయోజనాల వివరాలను సరిగ్గా వెల్లడించడం లేదు. 63 శాతం మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు తమకు వచ్చే స్పాన్సర్‌షిప్‌ల గురించి, ఆర్థిక సంస్థలతో ఉన్న సంబంధాల గురించి సరైన వివరాలు వెల్లడించలేదు.
→ ఈ నేపథ్యంలో నియంత్రణ, అవగాహనకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. సర్టీఫికేషన్ ప్రమాణాలను పటిష్టం చేయాలి. ఆర్థిక సలహాలు ఇచ్చే ఇన్‌ఫ్లుయెన్సర్లు, సెబీలో రిజిస్టర్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేయాలి. పర్యవేక్షణ విధానాలను కఠినతరం చేయాలి. సోషల్ మీడియాల్లో స్పాన్సర్డ్ కంటెంట్‌ను స్పష్టంగా పేర్కొనాలి. ఫిన్‌ఫ్లుయెన్సర్ల విశ్వసనీయతను ధృవీకరించే విధానాలను రూపొందించాలి. అలాగే, రిటైల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
ఉపయోగాలు ఉన్నాయి, రిస్కులూ ఉన్నాయి..
గత అయిదేళ్లుగా ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య అనేక రెట్లు పెరిగింది. ఇది స్వాగతించతగిన పరిణామమే అయినప్పటికీ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అధ్యయనం ప్రకారం వీరిలో చాలా మంది స్పెక్యులేటర్లే ఉంటున్నారు తప్ప నిజమైన ఇన్వెస్టర్ల సంఖ్య తక్కువే ఉంటోంది. వీరిని ప్రభావితం చేస్తూ, అక్రమంగా లబ్ధి పొందుతున్న ఫిన్‌ఫ్లుయెన్సర్లను కట్టడి చేసేందుకు సెబీ భారీ జరిమానాలు విధిస్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. దీంతో ఫిన్‌ఫ్లుయెన్సర్లను నియంత్రించడానికి ఇంకా చాలా సమయమే పట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ దిశగా తగు చర్యలు తీసుకోవాలంటే ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణులను అర్థం చేసుకోవడం, ఫిన్‌ఫ్లుయెన్సర్లు అందిస్తున్న కంటెంట్‌ను సమీక్షించడం కీలకమైన అంశాలని సీఎఫ్‌ఏ గుర్తించింది. ఇందులో భాగంగానే నిర్వహించిన అధ్యనయంలో ఇన్వెస్టర్లను ఫిన్‌ఫ్లుయెన్సర్లు గణనీయంగా ప్రభావితం చేస్తున్న సంగతి వెల్లడైంది. ఇన్‌ఫ్లుయెన్సర్ల సలహాల మేరకు పెట్టుబడులు పెట్టినట్లు 82 శాతం మంది ఫాలోయర్లు తెలిపారు. వీరిలో 72 శాతం మందికి ఆర్థికంగా ప్రయోజనాలు కూడా లభించాయి. అయితే, ఇందులో రిసు్కలూ ఉంటున్నాయి. వయస్సులో కాస్త పెద్దవారైన ఇన్వెస్టర్లలో (40 ఏళ్లు అంతకు పైబడి) 14 శాతం మంది తాము తప్పుదోవ పట్టించే సలహాలు విని మోసపోయినట్లు వెల్లడించినట్లు నివేదిక తెలిపింది.