ఆంధ్రాలో ఓలా ఈ–స్కూటర్ల ప్లాంటు?

Ola Plans E Scooter Manufacturing Plant In Andhra Pradesh - Sakshi

అనువైన రాష్ట్రాలను పరిశీలిస్తున్న ఓలా ఎలక్ట్రిక్‌ 

ప్రభుత్వాలతో చర్చలు

న్యూఢిల్లీ: ట్యాక్సీ సేవల సంస్థ ఓలాలో భాగమైన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ తాజాగా ఈ–స్కూటర్ల తయారీ ప్లాంటు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. సుమారు 20 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యంతో దీన్ని నెలకొల్పనుంది. ఇందుకోసం అనువైన ప్రాంతాన్ని ఎంచుకోవడంపై కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 100 ఎకరాల విస్తీర్ణంలో ఓలా ఈ అధునాతన ప్లాంటును ఏర్పాటు చేయనుందని, సౌర విద్యుత్‌ను విస్తృతంగా వినియోగించనుందని వివరించాయి. వచ్చే 18–24 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాలని ఓలా ఎలక్ట్రిక్‌ యోచిస్తున్నట్లు పేర్కొన్నాయి. దీనిపై స్పందించేందుకు ఓలా వర్గాలు నిరాకరించాయి. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విభాగంలో బజాజ్‌ ఆటో, హీరో ఎలక్ట్రిక్‌ తదితర సంస్థలతో ఓలా పోటీ పడాల్సి రానుంది. ఇందుకోసం అవసరమైన నిధులను సమకూర్చుకోవడంలో భాగంగా టైగర్‌ గ్లోబల్, మ్యాట్రిక్స్‌ ఇండియా, టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా సహా పలు దిగ్గజ సంస్థల నుంచి ఓలా ఎలక్ట్రిక్‌ దాదాపు 40 కోట్ల డాలర్లు సమీకరించింది. ఇటీవల మేలో ఆమ్‌స్టర్‌డామ్‌కి చెందిన ఎటర్గో బీవీ సంస్థను కొనుగోలు చేసింది. 1,000 మంది ఇంజినీర్లను నియమించుకుంటున్నట్లు, త్వరలో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆగస్టులో వెల్లడించింది.

చార్జింగ్‌ స్టేషన్స్‌ ఉంటేనే ఈవీ రయ్‌! 
ముంబై: ఆటోమొబైల్‌ పరిశ్రమలో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ (ఈవీ) గేమ్‌ ఛేంజర్‌గా మారనుంది. ద్విచక్ర, త్రిచక్ర, ఆటో విభాగంలోని వాహనాలు రయ్‌మని దూసుకుపోనున్నాయి. 2030 నాటికి దేశంలో మొత్తం ద్విచక్ర వాహన పరిశ్రమలో ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌ 25–35 శాతం, త్రీవీలర్స్‌ 65–75 శాతం, ప్యాసింజర్‌ వెహికిల్స్‌ (పీవీ) 10–15 శాతం, పర్సనల్‌ సెగ్మెంట్‌ 20–30 శాతం, ఎలక్ట్రిక్‌ బస్‌లు 10–12 శాతానికి చేరుకుంటాయని కేపీఎంజీ–సీఐఐ సంయుక్తంగా విడుదల చేసిన ‘‘షిఫ్టింగ్‌ గేర్స్, ఎవాల్వింగ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ ల్యాండ్‌స్కేప్‌ ఇన్‌ ఇండియా’’ నివేదిక తెలిపింది.  ఈవీ వాహనాలను మరింత డిమాండ్‌ రావాలంటే విస్తృత చార్జింగ్‌ నెట్‌వర్క్స్‌ అవసరమని పేర్కొంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top