
ఓలా ఎలక్ట్రిక్ తమిళనాడు కృష్ణగిరిలో ఉన్న ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో 10 లక్షల వాహనాలను(ఒక మిలియన్) ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. 2021 ఈ ప్లాంటులో తయారీ ప్రారంభించినప్పట్టి నుంచి నాలుగేళ్లలో ఈ మైలురాయిని చేరుకున్నట్లు పేర్కొంది. ఎలక్ట్రిక్ స్కూట్లర్లు ఎస్1 పోర్ట్‌ఫోలియోకు, ఇటీవల విడుదల చేసిన రోడ్‌స్టర్‌ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లకు ఆదరణ లభించడంతో తయారీలో వృద్ధి సాధించగలిగామని వివరించింది.
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ‘రోడ్‌స్టర్ ఎక్స్‌ప్లస్’ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. మిడ్‌నైట్ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. ‘‘మాపై నమ్మకం, మా లక్ష్యంపై విశ్వాసం ఉంచిన ప్రతి భారతీయుడు గర్వంచదగిన క్షణాలు ఇవి. నాలుగేళ్ల క్రితం ఒక ఆలోచనతో మొదలై నేడు దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్నాము. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. శిలాజ ఇంధన వాహనాలకు స్వస్తి పలికి ప్రపంచస్థాయిలో భారత్‌ను ఈవీ హబ్‌గా నిలపడం మా ధ్యేయం’’ అని ఓలా అధికార ప్రతినిధి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ముడి చమురు స్టోరేజ్ కోసం రూ.5,700 కోట్లతో ప్రాజెక్ట్