యుఎస్ చిప్ దిగ్గజం ఎన్విడియా (Nvidia) కొత్త మైలురాయిని తాకింది. 5 ట్రిలియన్ డాలర్ల (రూ.442 లక్షల కోట్లు) మార్కెట్ విలువను చేరుకున్న ప్రపంచంలోని మొదటి సంస్థగా నిలిచింది. సాధారణ గ్రాఫిక్స్-చిప్ డిజైనర్ నుండి ప్రారంభమైన ఎన్విడియా అనతి కాలంలోనే ఏఐ టైటాన్గా ఎదిగింది. పెరుగుతున్న ఏఐ బూమ్ దాని చిప్స్ కోసం డిమాండ్ను పెంచుతోంది. ఎన్విడియా స్టాక్స్ను రికార్డు గరిష్టాలకు నడిపిస్తోంది.
ఎన్విడియా కంపెనీ 2023 జూన్లో మొదటిసారిగా 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను చేరుకుంది. తర్వాత వేగంగా పెరుగుతూ మూడు నెలల క్రితం 4 ట్రిలియన్ డాలర్ల వాల్యుయేషన్ మార్కును తాకింది. ఈ చిప్ మేకర్ షేర్ ధర బుధవారం (అక్టోబర్ 29) ఉదయం 5.6% పెరిగి 212 డాలర్లకు చేరుకుంది. చైనాలో ఎన్విడియా అమ్మకాల గురించి మదుపరుల్లో ఆశావాదం ఈ పెరుగుదలకు కారణమైంది.
ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా నిలిచిన ఎన్విడియా.. ఏఐ వ్యయ కేళిలో అతిపెద్ద విజేతగా అవతరించింది. సాంకేతిక రంగంలో ప్రత్యర్థులను అధిగమించింది. అనేక ఏఐ కంపెనీలకు ఎన్విడియా చిప్లే మూలం కావడంతో ఓపెన్ ఏఐ, ఒరాకిల్తో సహా ప్రముఖ ఏఐ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.
దేశాల జీడీపీలను మించిన మార్కెట్ విలువ
ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం.. ఎన్విడియా మార్కెట్ విలువ ఇప్పుడు యూఎస్, చైనా మినహా ప్రతి దేశం జీడీపీనీ మించిపోయింది. అలాగే యూఎస్ స్టాక్ మార్కెట్లోని ఎస్అండ్పీ 500 సూచీలో మొత్తం రంగాల విలువ కంటే ఎక్కువ.
మైక్రోసాఫ్ట్, యాపిల్ కూడా ఇటీవల 4ట్రిలియన్ డాలర్ల విలువ మార్కును దాటాయి. ఏఐ ఖర్చు గురించి వాల్ స్ట్రీట్ లో పెరుగుతున్న ఆశావాదంతో విస్తృత టెక్ ర్యాలీని బలోపేతం చేశాయి. ఈ సంవత్సరం అమెరికన్ స్టాక్ మార్కెట్లో అద్భుతమైన లాభాలు గడించిన సంస్థల్లో ఏఐ-సంబంధిత సంస్థలే 80% వాటాను కలిగి ఉన్నాయి.
ఇదీ చదవండి: అదానీ గ్రూప్ షేర్లదే అదృష్టం!


