
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్‌ఎస్‌ఈ) గవర్నింగ్ బోర్డు చైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, తెలుగు వ్యక్తి శ్రీనివాస్ ఇంజేటి నియమితులయ్యారు. 1960 మే 26న జన్మించిన శ్రీనివాస్.. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో బీఏ ఎకనామిక్స్ (ఆనర్స్), ఆ తర్వాత బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్‌క్లైడ్‌లో ఎంబీయే చేశారు. 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి (ఒరిస్సా కేడర్) అయిన శ్రీనివాస్‌కి కార్పొరేట్ రెగ్యులేషన్, ఆర్థిక సేవలు, గవర్నెన్స్, ప్రభుత్వ పాలసీలు తదితర అంశాల్లో నాలుగు దశాబ్దాల సుదీర్ఘానుభవం ఉంది.
2017 నుంచి 2020 వరకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా దివాలా చట్టం, కాంపిటీషన్ చట్టం, కంపెనీల చట్టం తదితర సంస్కరణలకు సారథ్యం వహించారు. 2020 నుంచి 2023 వరకు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్విసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్‌ఎస్‌సీఏ) వ్యవస్థాపక చైర్మన్‌గా వ్యవహరించారు. అంతకు ముందు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్‌గా ఖేలో ఇండియా ప్రోగ్రాంనకు శ్రీకారం చుట్టారు. అటు నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీకి కూడా సారథ్యం వహించడంతో పాటు సెబీ, ఎల్‌ఐసీ తదితర బోర్డుల్లో కూడా సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.