డిజిటల్‌ ట్యాక్స్‌పై కేంద్రం వెనకడుగు

No digital tax if goods sold by Indian arm of foreign e-commerce firms - Sakshi

భారత విభాగాల నుంచి విక్రయిస్తే పన్ను లేదు

విదేశీ ఈ కామర్స్‌ సంస్థలకు వెసులుబాటు

న్యూఢిల్లీ: సమాన అవకాశాలు కల్పించే దృష్టితో విదేశీ ఈ కామర్స్‌ సంస్థలపై అమలు చేస్తున్న 2 శాతం డిజిటల్‌ పన్ను విషయంలో కేంద్రం కొంత వెనక్కి తగ్గింది. భారత అనుబంధ విభాగాల ద్వారా విదేశీ ఈ కామర్స్‌ సంస్థలు విక్రయాలు నిర్వహిస్తే డిజిటల్‌ పన్ను ఉండదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు సవరించిన ఆర్థిక బిల్లు 2021లో కేంద్రం స్పష్టతనిచ్చింది. భారత్‌లో శాశ్వత విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నా లేదా ఇక్కడ ఆదాయపన్ను చెల్లిస్తున్నా 2 శాతం సమానత్వలెవీని చెల్లించక్కర్లేదని కేంద్రం పేర్కొంది. అయితే భారత్‌లో ఆదాయపన్ను చెల్లించకుండా ఈ కామర్స్‌ విక్రయాలు చేపట్టే విదేశీ సంస్థలపై ఇక ముందూ 2 శాతం పన్ను కొనసాగుతుందని స్పష్టం చేసింది.

వార్షిక ఆదాయాలు రూ.2 కోట్లు దాటిన విదేశీ సంస్థలపై డిజిటల్‌ ట్యాక్స్‌ను 2020 ఏప్రిల్‌లో కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన విషయం గమనార్హం. ‘సవరణ ద్వారా ఒకటి స్పష్టం చేయదలుచుకున్నాను. భారత్‌లో నివసించే వారికి సంబంధించిన వస్తువులపై సమానత్వ పన్ను అమలు కాదు. భారత్‌లో పన్నులు చెల్లించే భారత వ్యాపార సంస్థలు.. అదే సమయంలో భారత్‌లో ఎటువంటి పన్నులు చెల్లించకుండా ఈ–కామర్స్‌ విక్రయాలు నిర్వహించే విదేశీ కంపెనీల మధ్య సమాన అవకాశాల కోణంలోనే దీన్ని ప్రవేశపెట్టాం’ అని ఆర్థిక మంత్రి సీతారామన్‌ లోక్‌సభకు తెలిపారు. డిజిటల్‌ ట్యాక్స్‌ అన ్నది అమెరికా కంపెనీల పట్ల వివక్ష చూపించడమేనంటూ అమెరికా గతంలో ఆరోపించింది.  

భారత రేటింగ్‌ తగ్గదు
 భారత్‌కు పెట్టుబడుల రేటింగ్‌ కొనసాగుతుందని.. రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌కు అవకాశాల్లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిల్లోనే ఉండడం, అధిక జీడీపీ వృద్ధి, రికార్డు స్థాయి విదేశీ పెట్టుబడులు, తక్కువ ద్రవ్యలోటు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలిచే అంశాలుగా పేర్కొన్నారు. యూపీఏ హయంలో 2009–14 మధ్య సగటు జీడీపీ 6.7 శాతంగా ఉంటే, ఎన్‌డీఏ హయాంలో 2014–19 మధ్య 7.5 శాతంగా ఉన్నట్టు చెప్పారు. కాంగ్రెస్‌ హయంలోని యూపీఏ సర్కారు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యçస్తం చేయగా, మోదీ సర్కారు దీన్ని సరైన దారిలో పెట్టినట్టు తెలిపారు.

ఆర్థిక బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం
ఆర్థిక బిల్లు 2021కి రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. మంగళవారం లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు బుధవారం రాజ్యసభ ముందుకు వచ్చింది. చర్చలో భాగంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సీతారామన్‌ సమాధానమిచ్చారు. చర్చ అనంతరం మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో బడ్జెట్‌ 2021–22కు పార్లమెంటు ఆమోదం పూర్తయింది. పీఎఫ్‌ సభ్యులకు పన్ను లేని చందా రూ.5 లక్షలకు పెంచడం సహా పలు సవరణలను బిల్లులో ప్రతిపాదించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top