
ఏప్రిల్‌లో రూ.2.37 లక్షల కోట్లు
12.6 శాతం పెరుగుదల
నెలవారీగా ఆల్‌టైమ్ గరిష్టం
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్ల పరంగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సరికొత్త రికార్డు నమోదైంది. గతేడాది ఏప్రిల్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 12.6 శాతం అధికంగా రూ.2.37 లక్షల కోట్లు వసూలైంది. 2017 జూలై 1 నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక నెలవారీ గరిష్ట ఆదాయం ఇదే కావడం గమనార్హం. 2024 ఏప్రిల్ నెలకు జీఎస్‌టీ ఆదాయం రూ.2.10 లక్షల కోట్లుగా ఉంది.
ఇక ఈ ఏడాది మార్చి నెలలో ఇది రూ.1.96 లక్షల కోట్లుగా ఉంది. దేశీ లావాదేవీలపై జీఎస్‌టీ 10.7 శాతం పెరిగి రూ.1.9 లక్షల కోట్లుగా నమోదైంది. దిగుమతి చేసుకున్న వస్తువులపై జీఎస్‌టీ 20.8 శాతం వృద్ధితో రూ.46,913 కోట్లకు చేరింది. రిఫండ్‌లు 48% అధికంగా రూ.27,341 కోట్లుగా ఉన్నాయి. రిఫండ్‌లను సర్దుబాటు చేసి చూస్తే నికర జీఎస్‌టీ ఆదాయం క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 9 శాతం వృద్ధితో రూ.2.09 లక్షల కోట్లకు చేరుకుంది. దేశీ లావాదేవీలపై సెంట్రల్ జీఎస్‌టీ రూ.48,634 కోట్లు కాగా, స్టేట్ జీఎస్‌టీ రూ.59,372 కోట్లు సమకూరింది. ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.69,504 కోట్లు, సెస్స్ వసూళ్లు రూ.12,293 కోట్ల చొప్పున ఉన్నాయి.
బలమైన ఆర్థిక పనితీరు: డెలాయిట్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల జీఎస్‌టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లు మించడం బలమైన ఆర్థిక పనితీరుకు నిదర్శమని డెలాయిట్ ఇండియా పార్ట్‌నర్ ఎంఎస్ మణి పేర్కొన్నారు. అన్ని ప్రధాన తయారీ, వినియోగ రాష్ట్రాల్లో జీఎస్‌టీ వసూళ్లు ఏప్రిల్ నెలలో 11–16 శాతం మధ్య ఉన్నాయని.. అంతకుముందు నెలల్లో పెద్ద రాష్ట్రాల్లో తక్కువ వృద్ధి నమోదైన దానికి ఇది భిన్నమని తెలిపారు. అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థలోని బలాన్ని జీఎస్‌టీ వసూళ్లు చాటుతున్నట్టు ఈవై ట్యాక్స్ పార్ట్‌నర్ సౌరభ్ అగర్వాల్ అన్నారు.
సహకారాత్మక సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనం
‘‘జీఎస్‌టీ వసూళ్ల గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని, సహకారాత్మక సమాఖ్యవాదాన్ని చాటుతున్నాయి’’అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కేంద్ర, రాష్ట్రాల జీఎస్‌టీ అధికారుల కృషిని అభినందించారు