అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్‌, క్యాబ్‌ సర్వీసు..! | Sakshi
Sakshi News home page

అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్‌, క్యాబ్‌ సర్వీసు..!

Published Mon, Jan 1 2024 7:56 AM

No Additional Charges For Bookings On ONDC - Sakshi

బిర్యానీ తినాలని ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెడితే నేరుగా రెస్టారెంట్‌కు వెళ్లి తినే ఖర్చుకంటే అధికంగా ఛార్జీలు కనిపిస్తూంటాయి. హైదరాబాద్‌లోని ఏదైనా ప్రముఖ రెస్టారెంట్‌లో రూ.250కి దొరికే బిర్యానీ.. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే జీఎస్టీ, కన్వేయన్స్‌, ఇంటర్నెట్‌ హ్యాండ్లింగ్‌, ప్యాకింగ్‌, డెలివరీ ఛార్జీలన్నీ కలిపి రూ.300 పైగానే ఖర్చవుతోంది. రెస్టారెంట్‌ నుంచి ఇంటి దూరం పెరిగితే ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

ఇదిలా ఉండగా.. నిత్యం ఏదో అవసరానికి ఎమర్జెన్సీలో ఒకప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించాలంటే ఆన్‌లైన్‌లో క్యాబ్‌, బైక్‌ బుక్‌ చేస్తూంటారు. మార్నింగ్‌, ఈవినింగ్‌ సమయంలో ‘పీక్‌, సర్జ్‌ అవర్స్‌’ పేరుతో సాధారణం కంటే అదనంగా ఛార్జ్‌ చేస్తూంటారు. ఇలా కొన్ని సంస్థలు చేస్తున్న వ్యవహారాలపై నియంత్రణ లేకుండా పోయింది. దాంతో వినియోగదారులపై భారంపడుతోంది. అలాంటి వ్యవస్థలను సవాళు చేస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఓఎన్‌డీసీ (ఓపెన్‌ నెట్‌వర్క్‌ డిజిటల్‌ కామర్స్‌) వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. డీపీఐఐటీ(డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌) ఆధ్వర్యంలో వినియోగదారులకు నిర్దేశిత ధరల్లోనే ఫుడ్‌ డెలివరీలతో పాటు, క్యాబ్‌ సర్వీసులు, ఆన్‌లైన్‌లో వస్తువుల విక్రయం వంటి సేవలందిస్తున్నారు.

మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రెస్టారెంట్‌ ధరలు, వినియోగదారుడు ఉన్న దూరం ఆధారంగా నిర్దేశిత రుసుముతోనే ఆర్డర్లను చేర్చడం ఈ వేదిక ప్రత్యేకత. ఉదాహరణకు నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో బిర్యానీ రూ.300 ధర ఉంటే ఓఎన్‌డీసీ ద్వారా బుక్‌ చేస్తే డెలివరీ ఛార్జీలు కలిపి సుమారు రూ.325కి లభిస్తుంది. ఇంటర్నెట్‌, ప్యాకేజింగ్‌ ఛార్జీలు అంటూ అదనపు బాదుడు ఉండదు. 1,15,000 మందికి పైగా డెలివరీబాయ్స్‌తో బెంగళూరు, కొచ్చి, మైసూరు, కోల్‌కతా నగరాల్లో ఈ వేదిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆ ప్రాంతాల్లో వీరంతా రూ.160కోట్ల ఆదాయాన్ని పొందారు.

హైదరాబాద్‌లోనూ ఇటీవల ఓఎన్‌డీసీ సేవలు ప్రారంభించింది. తెలంగాణ గిగ్‌వర్కర్స్‌ అసోసియేషన్‌కు చెందిన డెలివరీబాయ్‌లు ఇందులో భాగస్వాములైనట్లు ఆ సంస్థ పేర్కొంది. ఓఎన్‌డీసీకు సంబంధించి ప్రత్యేకమైన యాప్‌ ఏమీ లేదు. యూపీఐ పేమెంట్‌ యాప్‌ల ద్వారానే నేరుగా ఆర్డర్‌ ఇవ్వొచ్చు. ప్రస్తుతం పేటీఎం ద్వారా ఇది నగరవాసులకు అందుబాటులో ఉంది. హైదరాబాద్‌కు చెందిన 25వేల మంది డెలివరీబాయ్‌లు ఇందులో పనిచేస్తున్నారు.

ఇదీ చదవండి: ఫ్రీ సినిమా పేరిట సైబర్‌ మోసం.. ఏం చేస్తున్నారంటే..

హైదరాబాద్‌లో ఏటా కోటి కంటే ఎక్కువ బిర్యానీలు అమ్ముడవుతున్నాయి. 15 వేలకు పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. ఏటా కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే రూ.500 కోట్ల వ్యాపారం జరుగుతోందని మార్కెట్‌ విశ్లేషకుల అంచనా. కేంద్రం ప్రారంభించిన ఓఎన్‌డీసీ వేదిక ఎక్కువమందికి చేరువైతే సుమారు రూ.50కోట్ల మేర వినియోగదారులకు ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement