సెమీకండక్టర్‌ దిగ్గజంగా భారత్‌!  | NITI Aayog Roadmap Targets Semiconductor Sector | Sakshi
Sakshi News home page

సెమీకండక్టర్‌ దిగ్గజంగా భారత్‌! 

May 31 2026 5:37 AM | Updated on May 31 2026 5:37 AM

NITI Aayog Roadmap Targets Semiconductor Sector

పదేళ్లలో రూ.14.25 లక్షల కోట్ల విలువే లక్ష్యం 

రూ.17.5 లక్షల కోట్ల పెట్టుబడులు కావాలి 

మూడో వంతు ప్రభుత్వమే సమకూర్చాలి 

నీతి ఆయోగ్‌ నివేదిక సూచన

న్యూఢిల్లీ: సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌ కేవలం భాగస్వామ్యానికే పరిమితం కాకుండా దిగ్గజంగా ఎదగాలని, 2035 నాటికి 120–150 బిలియన్‌ డాలర్ల (రూ.14.25 లక్షల కోట్లు సుమారు) విలువైన సెమీకండక్టర్‌ వ్యాల్యూచైన్‌ నిర్మించుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని నీతి ఆయోగ్‌ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు అవసరమైన పెట్టుబడుల్లో మూడింట ఒక వంతును ప్రభుత్వమే సమకూర్చడం ద్వారా యాంకర్‌ పాత్రను పోషించాలంటూ, తద్వారా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కల్పించొచ్చని పేర్కొంది.

 ‘భారత్‌ దేశ సెమీకండక్టర్‌ పరిశ్రమ భవిష్యత్‌’ పేరుతో ఒక నివేదికను నీతి ఆయోగ్‌ రూపొందించింది. అంతర్జాతీయంగా పోటీనివ్వగలిగిన సెమీకండక్టర్‌ వ్యవస్థను దేశీయంగా నిర్మించుకునేందుకు 135–180 బిలియన్‌ డాలర్ల (రూ.17.10 లక్షల కోట్లు) పెట్టుబడులు వచ్చే దశాబ్ద కాలంలో అవసరమవుతాయని తెలిపింది. ముఖ్యంగా డిజైన్, ఫ్యాబ్రికేషన్, అత్యాధునిక ప్యాకేజింగ్, మేటీరియల్స్, అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఈ మేరకు పెట్టుబడులు కావాల్సి ఉంటుందని పేర్కొంది.  

దిగుమతులను తగ్గించుకోవాలి.. 
ప్రస్తుతం భారత్‌లో సెమీకండక్టర్ల డిమాండ్‌ వేగంగా పెరుగుతుండగా, ఇందులో 90 నుంచి 95 శాతం వరకు దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్నట్టు నీతి ఆయోగ్‌ నివేదిక తెలిపింది. దీనివల్ల భారీగా విదేశీ మారకద్రవ్యం తరలిపోవడమే కాకుండా, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో అడ్డంకులు ఏర్పడినప్పుడు దేశ రక్షణ, డిజిటల్‌ రంగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. 2035 నాటికి దేశీయ సెమీకండక్టర్‌ మార్కెట్‌ 200 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందన్న అంచనా వ్యక్తం చేస్తూ.. ఈ డిమాండ్‌ను దేశీయంగానే తీర్చుకునే విధంగా పరిశ్రమను నిర్మించుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. దేశీయంగా డిమాండ్‌ స్థాయిలో ఉత్పాదకత లేకపోవడాన్ని గొప్ప అవకాశంగా మలుచుకోవాలని సూచించింది. 

టెక్నాలజీలో స్వావలంబనతోనే వికసిత్‌ భారత్‌ 
బ్లాక్‌బాక్స్‌ సాంకేతికతల దిగుమతులపై ఆధారపడడం వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనకు పెద్ద అవరోధమని నీతి ఆయోగ్‌ వైస్‌చ ఐర్మన్‌ అశోక లాహిరి పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించేందుకు సాంకేతిక సౌర్వబౌమత్వం పునాది కావాలన్నారు. అది మౌలిక వసతుల నుంచే ఆరంభం కావాలన్నారు. సరికొత్త పరిశోధనలు, సొంత డిజైన్ల సృష్టి, దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించే స్థిరమైన విధానాలు, అధునాతన ప్యాకేజింగ్‌ మరియు కాంపౌండ్‌ సెమీకండక్టర్ల ఉత్పత్తి, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి అవసరమని ఈ నివేదిక సూచించింది. 

భారతదేశం కేవలం చిప్స్‌ వినియోగించే దేశంగా కాకుండా, ప్రపంచ సెమీకండక్టర్‌ సరఫరా వ్యవస్థలో ఒక తప్పనిసరి భాగస్వామిగా మారాలనే తమ సంకల్పాన్ని ఈ నివేదిక చాటిచెబుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నివేదిక విడుదల సందర్భంగా పేర్కొన్నారు. సెమీ కండక్టర్లకు సంబంధించి పూర్తి స్థాయి ఎకోసిస్టమ్‌ను (డిజైన్, నైపుణ్య వనరులు, మెటీరియల్స్, ఎక్విప్‌మెంట్, ఫ్యాబ్, ప్యాకేజింగ్‌) నిర్మించడంపై తాము దృష్టి పెట్టినట్టు కేంద్ర ఎల్రక్టానిక్స్‌ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement