
భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ విదేశాల్లో భారీ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఒక భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. రియల్ డీల్ నివేదిక ప్రకారం.. న్యూయార్క్‌లోని ట్రిబెకా ప్రాంతంలో ఉన్న ఈ భవనాన్ని ఆయన 17.4 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.145 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకున్నారు.
ముఖేష్ అంబానీ కొనుగోలు చేసిన ఈ భవనం ట్రిబెకాలోని 11 హ్యూబర్ట్ స్ట్రీట్ లో ఉంది. టెక్ బిలియనీర్, యుబిక్విటి చైర్మన్, సీఈవో రాబర్ట్ పెరా 2018లో 20 మిలియన్ డాలర్లకు ఈ భవనాన్ని కొనుగోలు చేశారు. తర్వాత దీన్ని చిన్నపాటి మాన్షన్‌గా మార్చాలని అనుకున్నా కుదరలేదు. దీంతో ఈ భవంతి దాదాపు పదేళ్లుగా ఎటువంటి వినియోగం లేకుండా ఖాళీగా ఉంది. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికన్ అనుబంధ సంస్థ దీన్ని కొనుగోలు చేసింది. రాబర్ట్ పెరా కొన్న ధర కంటే తక్కువకు దీన్ని విక్రయించడం గమనార్హం.
2023 ఆగస్టులో ముఖేష్ అంబానీ మాన్హాటన్ లోని వెస్ట్ విలేజ్ లో ఉన్న తన 9 మిలియన్ డాలర్ల నివాసాన్ని విక్రయించారు. ఆ తర్వాత రెండేళ్ల అనంతరం మళ్లీ ఇప్పుడు న్యూయార్క్‌లో భవంతిని కొనుగోలు చేయడం విశేషం. పెరా ఈ భవనాన్ని 2021లోనే 25 మిలియన్ డాలర్లకు అమ్మకానికి పెట్టారు. కానీ ఇప్పుడు ముఖేష్ అంబానీ 17.4 మిలియన్ డాలర్లకే దీన్ని దక్కించుకున్నారు.
ఇదీ చదవండి: ట్రైనింగ్ ఇచ్చినోళ్లనే తీసేశారు.. 500 మంది తొలగింపు!