
మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్.. స్పెషల్ అపార్చూనిటీస్ ఫండ్ పేరుతో న్యూ ఫంఢ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌వో)ను ప్రకటించింది. ఆగస్ట్ 8తో ముగుస్తుంది. తిరిగి ఆగస్ట్ 21 నుంచి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. వ్యాపార పరంగా ప్రత్యేక అవకాశాలను చూస్తున్న కంపెనీల్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. కార్పొరేట్ స్థాయిలో కంపెనీ వ్యాపారాల విభజన, విలీనాలు, కొనుగోళ్లు, ప్రభుత్వ విధానాల్లో మార్పులు, ఏదైనా రంగాల్లో కొత్తగా అవకాశాలు ఏర్పడుతుండడం, నియంత్రణపరమైన మార్పులను అవకాశాలుగా మలుచుకుని ఇన్వెస్ట్ చేస్తుంది.
కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడిని మొదటి మూడు నెలల్లో వెనక్కి తీసుకుంటే 1% ఎగ్జిట్ లోడ్ చార్జీ పడుతుంది. ఆ తర్వాత ఉపసంహరణపై ఎలాంటి చార్జీలుండవు. ఈ పథకంలో రిస్క్ ఎక్కువ. నిఫ్టీ 500 టీఆర్‌ఐ ఈ పథకం పనితీరుకు ప్రామాణికం. అజయ్ ఖండేల్‌వాల్, అతుల్ మెహ్రా, బాలచంద్ర షిండే, రాకేశ్ శెట్టి, సునీల్ సావంత్ ఫండ్ మేనేజర్లుగా సేవలు అందించనున్నారు.
జెరోధా మల్టీ అస్సెట్ ప్యాసివ్ ఎఫ్‌వోఎఫ్
జెరోధా మ్యూచువల్ ఫండ్ కొత్తగా జెరోదా మల్టీ అస్సెట్ ప్యాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్)ను ప్రారంభించింది. ఈక్విటీ, డెట్ ఇండెక్స్ ఫండ్స్/ఈటీఎఫ్‌లు, కమోడిటీ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఆగస్ట్ 8న ఎన్‌ఎఫ్‌వో ముగుస్తుంది. ఐదు పనిదినాల అనంతరం తిరిగి క్రయ, విక్రయాలకు అందుబాటులోకి వస్తుంది. ఈక్విటీ, డెట్, కమోడిటీల్లో పెట్టుబడులకు ఈ పథకం వీలు కల్పిస్తుంది.
పోర్ట్‌ఫోలియోకి రిస్క్, అస్థిరతలు తగ్గించడం ప్రధాన ధ్యేయం. ముఖ్యంగా 50–70 శాతం పెట్టుబడులను ఈక్విటీ ఈటీఎఫ్/ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. 10–20 శాతం డెట్ ఈటీఎఫ్/ఇండెక్స్ ఫండ్స్, 20–30 శాతం కమోడిటీ ఈటీఎఫ్‌లకు (బంగారం, వెండి) కేటాయిస్తుంది. పెట్టుబడులను వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలని చూసే వారి కోసం ఈ పథకం తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.