ఆస్తుల మానిటైజేషన్‌ డీలా.. టార్గెట్‌లో రూ.25 లక్షల కోట్ల లోటు | Sakshi
Sakshi News home page

ఆస్తుల మానిటైజేషన్‌ డీలా.. టార్గెట్‌లో రూ.25 లక్షల కోట్ల లోటు

Published Tue, Feb 6 2024 7:47 AM

Monetization Of Assets of Public Sector Undertakings - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు ఆస్తుల మానిటైజేషన్‌ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2024–25) లక్ష్యంగా పెట్టుకున్న రూ. 1.75 లక్షల కోట్లను అందుకోలేకపోవచ్చని తెలుస్తోంది. దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే వివరాల ప్రకారం రూ. 1.5 లక్షల కోట్లను సమకూర్చుకోనున్నాయి. 

నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్రౌన్‌ఫీల్డ్‌(పాత) మౌలిక సదుపాయాల ఆస్తుల అంచనా విలువ రూ. 6 లక్షల కోట్లు. 2022–2025 మధ్య కాలంలో మానిటైజేషన్‌కు వీలున్న ఆస్తుల అంచనాలివి. కాగా.. ఈ ఏడాది ఆస్తుల మానిటైజేషన్‌ ద్వారా రూ. 1.5 లక్షల కోట్లు సమీకరించగలమని తాజా ఇంటర్వ్యూలో పాండే తెలియజేశారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌(ఇన్విట్‌)లు, మైనింగ్, రహదారులు, విద్యుత్‌ రంగంలో టోల్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌(టీవోటీ) ద్వారా మానిటైజేషన్‌ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 

పెట్రోలియం రంగంలోనూ ఇకపై మానిటైజేషన్‌కు తెరతీయనున్నట్లు వెల్లడించారు. ఆస్తుల మానిటైజేషన్‌ ప్రక్రియ బడ్జెట్‌లో ప్రతిబింబించదని, జాతీయ రహదారుల అధీకృత సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) దీనిని నిర్వహిస్తుందని వివరించారు. ఈ నిధులు ప్రభుత్వానికి చేరుతాయని, తద్వారా ఇవి బడ్జెట్‌లో ప్రతిఫలిస్తాయని తెలియజేశారు. అయితే చాలా కేసులలో నిధులు సంస్థలకే చెందుతాయని, ప్రభుత్వానికి కాదని తెలియజేశారు. 

కొత్త మౌలిక సదుపాయాల కల్పనలో ప్రయివేట్‌ పెట్టుబడులను ఆకట్టుకునేందుకు వీలుగా ఆస్తుల మానిటైజేషన్‌ను చేపడుతున్నామని, ఇది ప్రభుత్వ విధానమని తెలియజేశారు. తద్వారా ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధితోపాటు పట్టణ, గ్రామీణ ప్రజల సంక్షేమాన్ని సమ్మిళితం చేయవచ్చని వివరించారు.

వ్యూహాత్మక వాటాల విక్రయంపై దృష్టి
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్‌ తదితర సంస్థల ప్రైవేటీకరణను పూర్తి చేయడంపైనే దృష్టి సారిస్తామని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల విభాగం (దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరే ఇతర కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో కొత్తగా వ్యూహాత్మక వాటాల విక్రయాన్ని పరిశీలించకపోవచ్చని స్పష్టం చేశారు. కాకపోతే లిస్టెడ్‌ ప్రభుత్వరంగ సంస్థల సబ్సిడరీల వాటాల విక్రయం ఉండొచ్చని సంకేతం ఇచ్చారు. 

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంక్‌లు, బీమా సంస్థల ఉమ్మడి మార్కెట్‌ విలువ గత మూడేళ్ల కాలంలో 500 శాతం పెరిగి రూ.58 లక్షల కోట్లకు చేరినట్టు పాండే చెప్పారు. భారత ప్రభుత్వం వాటాల విలువ 4 రెట్లు పెరిగి రూ.38 లక్షలకు చేరుకున్నట్టు తెలిపారు. బలమైన పనితీరు, వృద్ధి అవకాశాలు, మూలధన వ్యయాల పునర్‌నిర్మాణం, స్థిరమైన డివిడెండ్‌ పంపిణీ విధానం వల్ల ప్రభుత్వరంగ సంస్థల విలువ గణనీయంగా పెరిగినట్టు చెప్పారు. షిప్పింగ్‌ కార్పొరేషన్, ఎన్‌ఎండీసీ స్టీల్, హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ సంస్థల్లో వాటాల విక్రయ ప్రతిపాదనలు అమలు దశలో ఉండడం గమనార్హం. 

వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఇవి పూర్తి కావాల్సి ఉండగా, పలు అవాంతరాలతో జాప్యం నెలకొన్నట్టు చెప్పారు. ఇక హిందుస్థాన్‌ జింక్‌లో కేంద్ర ప్రభుత్వానికి 29.54 శాతం వాటా ఉంది. దీని విక్రయంపై పాండేకు ప్రశ్న ఎదురైంది. విడతల వారీగా వాటా విక్రయించాలన్న తమ ప్రతిపాదనకు హిందుస్థాన్‌ జింక్‌ యాజమాన్యం డీమెర్జర్‌ ప్రణాళికలతో అనిశ్చితి ఏర్పడినట్టు చెప్పారు. హిందుస్థాన్‌ జింక్‌ను మూడు వేర్వేరు కంపెనీలుగా డీమెర్జర్‌ చేసేందుకు కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.

Advertisement
Advertisement