భారీగా పామాయిల్‌ సాగు

Modi Advices Pvt Industry To Cut Edible Oil Imports - Sakshi

రైతుల నుంచి నూనె గింజలు కొనాలి

దిగుమతులు తగ్గించుకోవాలి

భారత మిల్లెట్స్‌కు బ్రాండింగ్‌ ప్రచారానికి సహకారం అందించాలి

కార్పొరేట్లకు ప్రధాని మోదీ సూచన

న్యూఢిల్లీ: దేశీ రైతులు పండించిన నూనెగింజలను కొనుగోలు చేస్తూ వారికి మద్దతుగా నిలవాలని ప్రైవేటు కంపెనీలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అదే సమయంలో వంట నూనెల దిగుమతులు తగ్గించుకోవాలని సూచించారు. ఇది ఇరు వర్గాలకు ప్రయోజనకరమన్నారు. భారత్‌ వచ్చే 3–4 ఏళ్లలో వంట నూనెల ఉత్పత్తిని 50 శాతం పెంచుకునే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. ‘నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్‌’ కార్యక్రమం కింద పెద్ద ఎత్తున పామాయిల్‌ సాగుకు పుష్కలంగా అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. ‘వ్యవసాయ రంగంపై బడ్జెట్‌ 2022 సానుకూల ప్రభావం’ అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.

‘‘వీటికి (కాయధాన్యాలు, నూనె గింజలకు) దేశంలో భారీ డిమాండ్‌ ఉంది కార్పొరేట్‌ ప్రపంచం ముందుకు రావాలి. మీకు భరోసానిచ్చే మార్కెట్‌ ఉంది. దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎంత పరిమాణంలో కాయధాన్యాలు, నూనె గింజలను కొనుగోలు చేస్తారో రైతులకు ముందే చెప్పండి’’అని మోదీ అన్నారు. పంట నష్టానికి రక్షణగా వ్యవసాయ బీమా యంత్రాంగం ఉన్నట్టు చెప్పారు. మనమంతా కలసి పనిచేయడం ద్వారా మన దేశ అవసరాలకు కావాల్సిన ఆహార ఉత్పత్తులను స్థానికంగానే పండించేలా చూడాల్సి ఉందన్నారు. దేశ వంట నూనెల అవసరాల్లో 60–65 శాతాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిని ప్రధాని గుర్తు చేశారు. వంట నూనెల దిగుమతి బిల్లు 2020–21 సీజన్‌లో రూ.1.17 లక్షల కోట్లుగా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి.  

చిరుధాన్యాల సంవత్సరం 2023
అధిక పోషక విలువలు కలిగిన భారతీయ మిల్లెట్స్‌ (చిరు ధాన్యాలు)కు బ్రాండింగ్, ప్రచారానికి సహకారం అందించాలని కార్పొరేట్‌ సంస్థలను ప్రధాని కోరారు. 2023 సంవత్సరాన్ని మిల్లెట్స్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ప్రకటించారు. నానో ఫెర్టిలైజర్‌ విభాగంలో కంపెనీలకు అపార అవకాశాలున్నట్టు గుర్తు చేశారు. దీనితోపాటు ఆహారశుద్ధి, ఇథనాల్‌ తయారీ సాగు ముఖచిత్రాన్ని మార్చేవిగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా భూసార పరీక్షా కేంద్రాల నెట్‌వర్క్‌ ఏర్పాటుకు స్టార్టప్‌లు, ఇన్వెస్టర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

భూముల సారాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. 2022–23 బడ్జెట్‌ భారత్‌ వ్యవసాయ రంగాన్ని ఆధునికంగా, స్మార్ట్‌గా మార్చడంపై దృష్టి సారించినట్టు ప్రధాని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో సాగు, వాణిజ్య అంశాలను ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ పూర్తిగా మార్చేస్తుందన్నారు. అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహించినప్పుడే సాగులో డ్రోట్‌ టెక్నాలజీ మరింత అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. గత మూడు నాలుగేళ్లలో 700 వ్యవసాయాధారిత స్టార్టప్‌లు ప్రారంభమైనట్టు చెప్పారు.

రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం
‘‘రైతుల ఆదాయం పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, రైతులకు ఆధునిక సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం. రైతులకు అద్దెపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను అందించే వ్యవస్థను కార్పొరేట్లు ఏర్పాటు చేయాలి. సహజ, సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేయడంపై అవగాహన పెంచేందుకు యూనివర్సిటీలు, శాస్త్రవేత్తలు కృషి చేయాలి’’ అని ప్రధాని కోరారు. గడిచిన ఆరేళ్లలో వ్యవసాయానికి బడ్జెట్‌ ఎన్నో రెట్లు పెంచామని, వ్యవసాయ రుణాలు ఏడేళ్లలో రెండున్నర రెట్లు పెరిగినట్టు ప్రదాని గుర్తు చేశారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం చిన్న రైతులకు మద్దతుగా నిలుస్తోందంటూ.. 11 కోట్ల మంది రైతులకు రూ.1.75 లక్షల కోట్ల రుణాలను ఈ పథకం కింద అందించినట్టు ప్రకటించారు. చమురులో 20 శాతం ఇథనాల్‌ను కలిపే లక్ష్యం దిశగా పనిచేస్తున్నట్టు, ఇప్పటికే ఇది 8 శాతానికి చేరినట్టు గుర్తు చేశారు.  

కేంద్ర బడ్జెట్‌ 2022: వ్యవసాయ రంగంపై సానుకూల ప్రభావం అన్న అంశంపై జరిగిన వెబినార్‌లో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top