మైక్రోసాఫ్ట్‌లో 10 వేల ఉద్యోగాల కోత

Microsoft lays off 10,000 employees amid global uncertainties - Sakshi

కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల వెల్లడి

న్యూయార్క్‌: టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా మైక్రోసాఫ్ట్‌ 10,000 మంది సిబ్బందిని తొలగించనుంది. ఇది కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో సుమారు అయిదు శాతం. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల బుధవారం ఈ విషయం వెల్లడించారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న నేపథ్యంలో కంపెనీ ముందుకు సాగాలంటే ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆయన పేర్కొన్నారు.

‘ప్రస్తుతం చేపడుతున్న మార్పుల కారణంగా 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఆఖరు నాటికి మొత్తం మీద 10,000 ఉద్యోగాలు తగ్గనున్నాయి. ఇది మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 5 శాతం లోపే ఉంటుంది‘ అని సిబ్బందికి పంపిన ఈమెయిల్‌లో సత్య నాదెళ్ల వివరించారు. తొలగించే ఉద్యోగులకు చెల్లించే పరిహారాలు మొదలైన వాటికి సంబంధించి 1.2 బిలియన్‌ డాలర్ల వ్యయాలను రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో మైక్రోసాఫ్ట్‌ చూపనుంది.

ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు పరిహారం, ఆరు నెలల పాటు ఆరోగ్య సంరక్షణ కవరేజీ మొదలైనవి ప్రయోజనాలు దక్కుతాయి. ప్రస్తుతం పరిస్థితులు గణనీయంగా మారిపోతున్నాయని నాదెళ్ల పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో ఇప్పటికే మాంద్యం నెలకొనగా, మరికొన్నింటిలో మాంద్యం తలెత్తవచ్చన్న అంచనాలుండటంతో  కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని వివరించారు. ఇప్పటికే ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ తదితర సంస్థలు 11,000 పైచిలుకు ఉద్యోగాల్లో కోత విధించాయి. అమెజాన్‌ కూడా 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top