ఓపెన్ ఏఐ నిపుణులను తన్నుకుపోయిన మెటా! | Meta Snatches OpenAI Stargate Experts in Billion Dollar AI Race | Sakshi
Sakshi News home page

ఓపెన్ ఏఐ నిపుణులను తన్నుకుపోయిన మెటా!

Apr 11 2026 1:43 PM | Updated on Apr 11 2026 2:21 PM

Meta Snatches OpenAI Stargate Experts in Billion Dollar AI Race

కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచంలో ఆధిపత్యం కోసం సాగుతున్న పోరు కొత్త మలుపు తిరుగుతోంది. చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐకు గట్టి షాక్ ఇస్తూ ఆ సంస్థలోని అత్యంత కీలకమైన నిపుణులను మెటా ప్లాట్‌ఫారమ్స్‌ తన గూటికి చేర్చుకుంటోంది. సూపర్ కంప్యూటింగ్, భారీ డేటా సెంటర్ల నిర్మాణంలో ఆరితేరిన కొందరు అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్‌ స్థాయి ఉద్యోగులు ఇప్పుడు మార్క్ జుకర్‌బర్గ్ టీమ్‌లో చేరడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

మెటా గూటికి స్టార్‌గేట్ వ్యూహకర్తలు

ఓపెన్ ఏఐ మౌలిక సదుపాయాల విభాగంలో కీలకంగా నిలిచిన పీటర్ హోషెల్, షమీజ్ హేమానీ, అనుజ్ సహారాన్ ఇప్పుడు మెటాలో చేరారు. వీరు ఓపెన్ ఏఐ అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘స్టార్‌గేట్’ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన వారు. ఈ ప్రాజెక్ట్‌ను వందల బిలియన్ డాలర్ల వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ సామర్థ్యాన్ని నిర్మించే లక్ష్యంతో చేపట్టారు. ఇప్పుడు ఈ నిపుణులు మెటా సొంత సూపర్ కంప్యూటింగ్ ప్రయత్నాలకు, ముఖ్యంగా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ విస్తరణకు కీలకంగా మారనున్నారు.

జుకర్‌బర్గ్ భారీ స్కెచ్: రూ. 11 లక్షల కోట్ల పెట్టుబడి!

ఏఐ రేసులో వెనుకబడకూడదనే పట్టుదలతో ఉన్న మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మౌలిక సదుపాయాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. కేవలం ఈ ఏడాదిలోనే సుమారు 135 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.11.25 లక్షల కోట్లు) మూలధన వ్యయాన్ని మెటా అంచనా వేస్తోంది. దీర్ఘకాలికంగా వందల బిలియన్ డాలర్లను ఏఐ హార్డ్‌వేర్, చిప్స్, డేటా సెంటర్ల కోసం వెచ్చించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ భారీ సామ్రాజ్యాన్ని నడిపించడానికి ఓపెన్ ఏఐ నుంచి వచ్చిన నిపుణులు దిక్సూచిగా మారనున్నారు.

రక్షణలో ఓపెన్ ఏఐ..

మరోవైపు, ఓపెన్ ఏఐ తన దూకుడుకు కాస్త బ్రేకులు వేసినట్లు కనిపిస్తోంది. కంపెనీ తన మౌలికసదుపాయాల వ్యూహాలను పునసమీక్షిస్తోంది. బ్రిటన్‌లో చేపట్టాలనుకున్న ‘స్టార్‌గేట్’ ప్రాజెక్టును కంపెనీ తాత్కాలికంగా పక్కన పెట్టింది. త్వరలో పబ్లిక్ లిస్టింగ్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్న ఓపెన్ ఏఐ అపరిమితమైన ఖర్చులను నియంత్రించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే కొత్త సైట్లను లీజుకు తీసుకోవడాన్ని కూడా వాయిదా వేసింది.

ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్‌ గిఫ్ట్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement