గ్రాట్యుటీ.. రిటైర్మెంట్‌ గిఫ్ట్! | Gratuity in India Eligibility Calculation Formula Latest Rules Explained | Sakshi
Sakshi News home page

గ్రాట్యుటీ.. రిటైర్మెంట్‌ గిఫ్ట్!

Apr 10 2026 3:40 PM | Updated on Apr 10 2026 3:48 PM

Gratuity in India Eligibility Calculation Formula Latest Rules Explained

ఒక సంస్థలో ఏళ్ల తరబడి పనిచేసిన ఉద్యోగికి, ఆ సంస్థ పట్ల వారు చూపిన అంకితభావానికి, విధేయతకు ఇచ్చే గౌరవపూర్వకమైన బహుమతే గ్రాట్యుటీ. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, ఉద్యోగి శ్రమకు యాజమాన్యం ఇచ్చే గుర్తింపు. మరి ఈ గ్రాట్యుటీ అందరికీ వస్తుందా? దీని లెక్కలేంటి? తాజా నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఓసారి పరిశీలిద్దాం.

గ్రాట్యుటీ అంటే ఏమిటి?

‘పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, 1972’ ప్రకారం, ఒక ఉద్యోగి ఒకే సంస్థలో దీర్ఘకాలం పనిచేసినందుకు ప్రతిఫలంగా యజమాని ఇచ్చే మొత్తాన్ని గ్రాట్యుటీ అంటారు. సాధారణంగా ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు, రాజీనామా చేసినప్పుడు లేదా దురదృష్టవశాత్తు మరణించినప్పుడు ఈ మొత్తాన్ని చెల్లిస్తారు.

గ్రాట్యుటీ పొందడానికి అర్హతలు

గ్రాట్యుటీ అందరికీ వర్తించదు. దీనికి కొన్ని ప్రాథమిక నియమాలు ఉన్నాయి. ఒకే సంస్థలో కనీసం 5 ఏళ్ల నిరంతర సేవలు పూర్తి చేసి ఉండాలి. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ఏ సంస్థ అయినా గ్రాట్యుటీ చట్టం పరిధిలోకి వస్తుంది. ఒకవేళ ఉద్యోగి మరణించినా లేదా ప్రమాదం వల్ల అంగవైకల్యం సంభవించినా ఈ ఐదేళ్ల నిబంధన వర్తించదు. అటువంటప్పుడు వారు పనిచేసిన కాలానికే గ్రాట్యుటీ చెల్లిస్తారు.

ఎలా లెక్కిస్తారు?

గ్రాట్యుటీ లెక్కించడానికి ఒక నిర్దిష్టమైన సూత్రం ఉంది. ఇందులో ప్రధానంగా రెండు అంశాలు కీలకం. చివరిగా తీసుకున్న వేతనం (బేసిక్‌+డీఏ), పూర్తి చేసిన సర్వీసు కాలం.

గ్రాట్యుటీ=(చివరగా తీసుకున్న వేతనం*సర్వీసు చేసిన మొత్తం సంవత్సరాలు*15)/26

ఇక్కడ 26 రోజులను ఒక నెలగా పరిగణిస్తారు. నెలలో 4 ఆదివారాలు తీసివేసి 15 రోజులను సగటు వేతనంగా లెక్కిస్తారు.

ఉదాహరణ:

రాము అనే వ్యక్తి ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో 10 ఏళ్ల 7 నెలలు పనిచేశాడు. అతను ఉద్యోగం వదిలేటప్పుడు అతని బేసిక్ పే, డీఏ కలిపి రూ.50,000 అనుకుందాం.

గమనిక: సర్వీసు కాలం 6 నెలల కంటే ఎక్కువ ఉంటే దాన్ని తదుపరి ఏడాదిగా పరిగణిస్తారు. అంటే ఇక్కడ రాము సర్వీసును 11 ఏళ్లుగా తీసుకోవాలి.

గ్రాట్యుటీ: (50000*11*15)/26=రూ.3,17,307.

ముఖ్యమైన అంశాలు

  • ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి గరిష్టంగా రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీని పన్ను మినహాయింపుతో పొందవచ్చు. కొత్త లేబర్ కోడ్ అమల్లోకి వస్తే ఈ పరిమితి పెరిగే అవకాశం ఉంది.

  • ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీపై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగులకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(10) ప్రకారం నిర్దేశిత పరిమితి వరకు మినహాయింపు లభిస్తుంది.

  • ప్రతి ఉద్యోగి తన గ్రాట్యుటీ కోసం నామినీని నియమించుకోవడం తప్పనిసరి.

ఇదీ చదవండి: రఫేల్‌ డీల్.. ‘స్వదేశీ’ అస్త్రాలకు పెద్దపీట!

Advertisement
 
Advertisement
Advertisement