లేఆఫ్స్.. కోత మొదలు.. డేట్‌ ఫిక్స్‌ | Meta Shocks Employees: 10 Percent Job Cuts Amid AI Spending Spree | Sakshi
Sakshi News home page

లేఆఫ్స్.. కోత మొదలు.. డేట్‌ ఫిక్స్‌

May 2 2026 9:00 AM | Updated on May 2 2026 10:36 AM

Meta Shocks Employees: 10 Percent Job Cuts Amid AI Spending Spree

సోషల్ మీడియా దిగ్గజం మెటా మరోసారి తన ఉద్యోగులకు షాకిచ్చింది. కృత్రిమ మేధ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్న క్రమంలో వ్యయ నియంత్రణలో భాగంగా మే 20వ తేదీ నుంచి సుమారు 10 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం మెటా శ్రామిక శక్తిలో తీవ్ర అనిశ్చితిని నింపుతోంది.

ఏమిటీ తాజా పరిణామాలు?

ఇటీవల కంపెనీ నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో ఈ కీలక ప్రకటన వెలువడింది. ఇప్పటికే మెటా ఆర్థికంగా స్థిరమైన పనితీరును కనబరుస్తున్నప్పటికీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సంస్థాగత మార్పులు తప్పవని యాజమాన్యం స్పష్టం చేసింది. మే 20న ఈ మొదటి దశలో 10 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నారు. ప్రస్తుత ప్రణాళికల ప్రకారం 2026 పూర్తయ్యే నాటికి ఈ ఉద్యోగ కోతలు మొత్తం శ్రామిక శక్తిలో 20 శాతానికి చేరుకునే అవకాశం ఉందని సంకేతాలు అందుతున్నాయి.

యాజమాన్యం ఏమంటోంది?

మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్లె గేల్ మాట్లాడుతూ, తదుపరి రౌండ్ల తొలగింపులు ఉండబోవనే హామీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. ‘మేము అత్యంత పోటీ వాతావరణంలో పనిచేస్తున్నాం. వ్యాపార ప్రాధాన్యతలను బట్టి జట్లు, ఖర్చుల విషయంలో చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. అయితే, ప్రభావితమైన కొంతమందిని వేరే విభాగాలకు తరలించే ప్రయత్నం చేస్తామని, మానవతా దృక్పథంతో బాధితులకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఏఐ పెట్టుబడుల ప్రభావం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేరుగా ఉద్యోగాల కోతలకు కారణం కాదని సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కంపెనీ తన బడ్జెట్‌లో ఎక్కువ భాగం మౌలిక సదుపాయాలు, ఉద్యోగుల జీతభత్యాల కోసం వెచ్చిస్తోంది. ఈ ఏడాది ఏఐ పరిశోధనలు, అత్యాధునిక కంప్యూటింగ్ వ్యవస్థల కోసం మెటా దాదాపు 125 బిలియన్‌ డాలర్ల నుంచి 145 బిలియన్‌ డాలర్ల వరకు ఖర్చు చేయనుంది. ‘ఒక విభాగంలో ఎక్కువ పెట్టుబడి పెట్టాలంటే మరో విభాగంలో వ్యయం తగ్గించక తప్పదు’ అని జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు ఏఐ విస్తరణ కోసం ఉద్యోగ భద్రతను బలి పెడుతున్నారనే వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.

ఉద్యోగుల్లో ఆందోళన

ప్రస్తుతం మెటాలో 77,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. పనితీరులో సామర్థ్యాన్ని పెంచే పేరుతో సాగుతున్న ఈ తొలగింపుల వల్ల ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అంతర్గత ఫోరమ్‌లలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పారదర్శకమైన కమ్యూనికేషన్ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: మరికొద్ది గంటల్లో ఫోన్లకు అలర్ట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement