రూ.25 లక్షల ప్యాకేజీ వద్దు.. క్యాబ్‌ డ్రైవింగే ముద్దు! | MBA Graduate Rejects Rs 25 Lakh Job, Chooses Ola Steering | Sakshi
Sakshi News home page

రూ.25 లక్షల ప్యాకేజీ వద్దు.. క్యాబ్‌ డ్రైవింగే ముద్దు!

Jun 1 2026 9:47 AM | Updated on Jun 1 2026 7:39 PM

MBA Graduate Rejects Rs 25 Lakh Job, Chooses Ola Steering

జీవితంలో స్థిరపడటానికి ఒక మంచి వైట్ కాలర్ జాబ్‌, చేతినిండా జీతం ఉంటే చాలని చాలామంది భావిస్తారు. కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనే ఏడాదికి రూ.25 లక్షల ప్యాకేజీ ఆఫర్ వస్తే ఎవరైనా ఏం చేస్తారు? కళ్లు మూసుకుని ఆఫర్ లెటర్ అందుకుంటారు. కానీ, ఆ యువకుడు మాత్రం అందరిలా ఆలోచించలేదు. ఆకర్షణీయమైన కార్పొరేట్ ఉద్యోగాన్ని సున్నితంగా తిరస్కరించి స్టీరింగ్ చేతపట్టాడు. ‘ఓలా’ క్యాబ్ డ్రైవర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన ఒక యువకుడి స్ఫూర్తిదాయక కథనం ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో వైరల్‌గా మారింది.

రూ.25 లక్షల ఆఫర్ తిరస్కరణ

సోషల్ మీడియా యూజర్ సచన్ షేర్ చేసిన ఈ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సచన్ తెలిపిన వివరాల ప్రకారం.. అతని సోదరుడు మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్‌ పూర్తి కాగానే ప్రముఖ కార్పొరేట్ సంస్థ నుంచి రూ.25 లక్షల వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగ ఆఫర్ సాధించాడు. అయితే, మొదటి నుంచి కార్పొరేట్ ఉద్యోగాలపై అతనికి ఆసక్తి లేదు. సొంతంగా ఏదైనా సాధించాలనే బలమైన సంకల్పంతో ఆ భారీ ఆఫర్‌ను తిరస్కరించాడు. ఊహించని విధంగా ఓలా క్యాబ్ నడపాలని నిర్ణయించుకున్నాడు.

ఈ నిర్ణయం కుటుంబంలో, బంధువుల్లో కలకలం రేపింది. ‘లక్షలు ఖర్చు పెట్టి చదివించింది కార్లు తోలడానికా?’ అంటూ బంధువులు, సమాజం అతన్ని విమర్శించాయి. ఉన్నత చదువులన్నీ వృధా అయిపోయాయని, భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నాడంటూ బహిరంగంగానే ఎగతాళి చేశారు. కానీ, ఆ యువకుడు తన లక్ష్యంపై నమ్మకంతో ముందడుగు వేశాడు.

డ్రైవర్ స్థాయి నుంచి ఫ్లీట్ ఓనర్ వరకు..

సమాజం అతన్ని కేవలం ఒక ‘క్యాబ్ డ్రైవర్’గా మాత్రమే చూసింది. కానీ సదరు ఎంబీఏ గ్రాడ్యుయేట్ మాత్రం అందులోనే ఒక అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని చూశాడు. కేవలం డ్రైవింగ్‌కే పరిమితం కాకుండా లాజిస్టిక్స్, రవాణా రంగాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. గడిచిన మూడేళ్ల కాలంలో క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వెళ్లాడు. సొంతంగా అదనపు వాహనాలను కొనుగోలు చేస్తూ వాటిని నిర్వహించడం ప్రారంభించాడు. సచన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం అతని సోదరుడు ఓలా ప్లాట్‌ఫారమ్ కింద ఏకంగా 5 కార్లను నడుపుతున్నాడు. అన్ని ఖర్చులు పోను నెలకు సుమారు రూ.1.5 లక్షల నికర ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.

నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు

ఈ వైరల్ పోస్ట్ కెరీర్ ఎంపికలపై నెటిజన్ల మధ్య చర్చకు తెరలేపింది. ఈ ప్రయాణాన్ని విశ్లేషిస్తూ సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాంప్రదాయక వైట్ కాలర్ ఉద్యోగాల చట్రం నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛను, స్వయం ఉపాధిని ఎంచుకున్న సదరు యువకుడి సాహసాన్ని అత్యధికులు అభినందిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు భిన్నంగా స్పందించారు. రూ.25 లక్షల కార్పొరేట్ ఉద్యోగంలో చేరి ఉంటే, మూడేళ్ల అనుభవం తర్వాత ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లతో అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చేదని అభిప్రాయపడ్డారు. కొంతమంది యూజర్లు ఈ ఆదాయ గణాంకాలను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఐదు కార్లపై నెలకు రూ.1.5 లక్షల నికర లాభం (అన్ని ఖర్చులు, డ్రైవర్ల జీతాలు పోను) సాధించడం అంత సులువు కాదని, దీనికి సంబంధించిన ఆధారాలు ఉంటే బాగుంటుందన్నారు.

ఇదీ చదవండి: పాపులర్‌ ఉద్యోగాల వెంటే పడకండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement