
ఏదైనా పెద్ద పండుగ వచ్చిందంటే చాలు.. ఎక్కెడెక్కడో ఉన్నవాళ్లంతా సొంతూళ్లకు పయనమవుతారు. దీంతో వాహనాల రాకపోకలతో రహదారులు కిక్కిరుస్తాయి. వందలకొద్దీ వాహనాలతో హైవేలు స్తంభిస్తాయి. ఇక కారు వేసుకుని వెళ్లి గంటలకొద్దీ ఆ హైవేలపై ఇరుక్కుపోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిని సంక్రాంతి సమయంలో మన తెలుగురాష్ట్రాల మధ్య హైవేలపై చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితే మహారాష్ట్రలో గణేష్ చతుర్థి సందర్భంగా ఉంటుంది.
మహారాష్ట్రలో గణేష్ చతుర్థి పండుగ సమయంలో తలెత్తే రద్దీకి కొంకణ్ రైల్వే వినూత్న పరిష్కారంతో ముందుకువచ్చింది. భారతదేశపు మొట్టమొదటి కార్ ఫెర్రీ రైలు సేవను కోలాడ్ (మహారాష్ట్ర), వెర్నా (గోవా) మధ్య ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ సేవ ద్వారా ప్రయాణికుల తమ ప్రైవేట్ కార్లను రైలు ద్వారా రవాణా చేయనుంది. అదే సమయంలో వాహనదారులు కూడా ఆ రైలుకు జతచేసిన ప్యాసింజర్ బోగీలలో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని కొంకణ్ రైల్వే పేర్కొంది.
గణేష్ చతుర్థి సందర్భంగా మహారాష్ట్రలోని రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్ రద్దీని ఉంటుంది. ఇంతటి ట్రాఫిక్‌లో కార్లను రోడ్డు మార్గం ద్వారా కోలాడ్, వెర్నా మధ్య తీసుకెళ్లాలంటే 20–22 గంటల సమయం పడుతుంది. ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ఈ కార్ ఫెర్రీ రైలు సహాయపడుతుంది. ఇది ప్రయాణ సమయాన్ని కేవలం 12 గంటలకు తగ్గిస్తుంది.
కోలాడ్-వెర్నా కార్ ఫెర్రీ రైలు సర్వీస్ ఆగస్ట్ 23 నుంచి సెప్టెంబర్ 11 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కోలాడ్ నుండి సాయంత్రం 5 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వెర్నా చేరుకుంటుంది. అయితే మూడు గంటలు ముందే అంటే మధ్యాహ్నం 2 గంటలకే కోలాడ్ స్టేషన్ వద్దకు కారు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక్కో రైలులో 20 ప్రత్యేక వ్యాగన్లు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో రెండు చొప్పున 40 కార్లు తీసుకెళ్తుంది. అయితే, కనీసం 16 కార్లు అయినా బుక్ అయితేనే ఈ రైలు నడుస్తుంది.
ఒక్కో కారుకు సరుకు రవాణా ఛార్జీ రూ.7,875 (వన్ వే) ఉంటుంది. భద్రత కోసం వాహనాలను సురక్షితంగా బిగించి హ్యాండ్ బ్రేకర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణ సమయంలో కారులో కూర్చునేందుకు ఎవరినీ అనుమతించరు. వాహనదారులు కూర్చునేందుకు సౌకర్యవంతమైన స్థలం ఉంటుంది. 3ఏసీ బోగీల్లో ఒక్కొక్కరికి రూ.935 చెల్లించి ఇద్దరు సీట్లు బుక్ చేసుకోవచ్చు. అదనంగా మరో వ్యక్తి ఉంటే రూ.190 చెల్లించి స్లీపర్ కోచ్ లో ప్రయాణించవచ్చు. దీని కోసం బుకింగ్స్ జూలై 21 నుంచి ఆగస్ట్ 13 వరకూ అందుబాటులో ఉంటాయి.