
సెబీకి ప్రాథమిక పత్రాలు దాఖలు
న్యూఢిల్లీ: సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రొవైడర్ లీప్ ఇండియా తొలి పబ్లిక్ ఇష్యూకి (ఐపీఓ) రాబోతోంది. ఈ ఇష్యూ ద్వారా రూ.2,400 కోట్లు సమీకరించాలని సంస్థ భావిస్తోంది. ఇందుకు అనుమతి కోరుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ.400 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది.
ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌సీ) కింద ప్రమోటర్లు రూ.2,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో రూ.300 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన మొత్తాన్ని ఇతర కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించనుంది. ఐఐఎఫ్‌ఎల్ క్యాపిటల్ సర్వీసెస్, జేఎం ఫైనాన్షియల్, యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా, అవెండస్ క్యాపిటల్ సంస్థలు ఈ ఇష్యూకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
సప్లై చైన్ రంగ సంస్థలకు అవసరమైన కంటైనర్లు, క్రేట్స్‌లాంటి అసెట్స్‌ను లీజుకు అందించే లీప్ ఇండియా 2013లో ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా 7,747 కస్టమర్ టచ్‌పాయింట్లు, 30 పుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు ఉన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.485 కోట్ల ఆదాయం, రూ.37.5 కోట్లు నికర లాభాన్ని ప్రకటించింది. పానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా, మారికో, హైయర్ అప్లయిన్సెస్, డైకిన్, డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ తదితర 900 పైగా కంపెనీలు, క్లయింట్లుగా ఉన్నాయి.