
గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ అండ్ కో ఇంక్ భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంపై దృష్టి సారించింది. అభివృద్ధి చెందుతున్న ఈ మార్కెట్‌లో భారత్‌ను వ్యూహాత్మక పెట్టుబడికి గమ్యస్థానంగా గుర్తించినట్లు కేకేఆర్ తెలిపింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న స్థిరాస్తి రంగంలో పెరుగుతున్న ఆసక్తిని ఇది హైలైట్ చేస్తుంది.
ప్రపంచ అస్థిరతల మధ్య కూడా దేశ ఆర్థిక అభివృద్ధి, విధానాలు, వినియోగదారుల ఆసక్తి మెరుగ్గాఉందని ఎత్తిచూపుతూ, ఎమర్జింగ్ మార్కెట్లలో భారత్ వ్యూహాత్మకంగా నిలుస్తుందని సంస్థ పేర్కొంది. రూపాయిలో స్వల్ప క్షీణతను కేకేఆర్ అంచనా వేసినప్పటికీ, దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపింది. మార్చి 2025 నాటికి ప్రపంచ వ్యాప్తంగా కేకేఆర్ 664 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను నిర్వహిస్తోంది. రియల్టీ పరంగా చైనాలో కల్లోల పరిస్థితులున్నాయని, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో స్తబ్దత నెలకొందని కంపెనీ చెప్పింది. భారత్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని తెలిపింది.
ఇదీ చదవండి: భారత్‌లోకి యూఎస్ జన్యుమార్పిడి పంటలు ఎంట్రీ?
భారతదేశం, జపాన్, ఆగ్నేయాసియాతో సహా ఆసియా రియల్ ఎస్టేట్ మార్కెట్లలో అభివృద్ధికి అవకాశాలను చూస్తున్నామని కేకేఆర్ తాజా సమీక్షలో పేర్కొంది. నిర్మాణాత్మక వృద్ధి, మార్కెట్ ఒడిదుడుకులు కలిసే ఆసియా రియల్ ఎస్టేట్‌ను అధిక రాబడికి అవకాశంగా చూస్తున్నట్లు తెలిపింది. ఈ-కామర్స్ వృద్ధి, డేటా సెంటర్ల విస్తరణ, సప్లై చెయిన్ ఆధునీకరణ వంటి విస్తృత అంశాలకు అనుగుణంగా లాజిస్టిక్స్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను భారత్‌లో ఆకర్షణీయ విభాగాలుగా గుర్తించినట్లు కూడా పేర్కొంది.