
గొడుగుల తయారీలో చైనా కంపెనీల ఉత్పత్తులపై ఆధారపడడాన్ని తగ్గిస్తూ దేశీయ వస్తువులను ఉపయోగించేలా, ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం ఇచ్చేలా కేరళ అంబ్రెల్లా మ్యానుఫ్యాక్చరర్స్(కేయూఎం) చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా పోపీ, జాన్స్, కొలంబో వంటి బ్రాండ్లు చైనా ముడి పదార్థాలపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తున్నాయి.
అయితే గొడుగుల తయారీలో ఉపయోగించే ‘టాఫెటా ఫ్యాబ్రిక్’ను ఇప్పటికీ తైవాన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీనికి భారత్‌లో ప్రత్యామ్నాయం ఇంకా లేకపోవడమే ఇందుకు కారణం. కేరళ గొడుగు తయారీదారులు చౌకైన చైనా దిగుమతుల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ‘అండర్ ఇన్వాయిసింగ్’, ‘డంపింగ్’ను కట్టడి చేయాలని దేశీయ తయారీదారులు వాదిస్తున్నారు.
అండర్ ఇన్ వాయిసింగ్‌లో భాగంగా వస్తువులు లేదా సేవల వాస్తవ విలువ కంటే ఇన్‌వాయిస్‌లపై ఉద్దేశపూర్వకంగా తక్కువ విలువను చూపుతారు. దాంతో పన్నులు, కస్టమ్స్ సుంకాలు లేదా నియంత్రణ పర్యవేక్షణను తప్పించుకోవడానికి వీలవుతుంది.
ఒక కంపెనీ తమ దేశీయ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు లేదా ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు వస్తువులను ఎగుమతి చేసినప్పుడు డంపింగ్ సమస్యలు ఎదురవుతాయి. మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకోవడానికి లేదా విదేశీ మార్కెట్‌లో పోటీ లేకుండా చేయడానికి కంపెనీలు ఇలా చేస్తూంటాయి.
ఇదీ చదవండి: సెబీ బోర్డు సమావేశంలో కీలక మార్పులు?
ఈ సమస్యలను కట్టడి చేసేలా ఫినిష్డ్ గొడుగులపై కనీస దిగుమతి ధర (ఎంఐపీ) విధించాలని దేశీయ తయారీదారలు కోరుతున్నారు. కార్టూన్ డిజైన్‌లు, మెరిసే లైట్లు, కొత్త డిజైన్లలో గొడుగులు తయారు చేస్తూ పరిశ్రమ ఆవిష్కరణలపై దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వం మద్దతుతో భారత్ గొడుగులకు సంబంధించి ప్రపంచ సరఫరాదారుగా మారగలదని తయారీదారులు నమ్ముతున్నారు. ఆఫ్రికా, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికాలోని ఎగుమతి మార్కెట్లను టార్గెట్ చేస్తున్నారు.