8వ పేకమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ | Justice Ranjana Prakash Desai Appointed Chairperson of 8th Central Pay Commission | Sakshi
Sakshi News home page

8వ పేకమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్

Oct 30 2025 3:12 PM | Updated on Oct 30 2025 3:35 PM

Justice Ranjana Prakash Desai appointed Chairperson of the 8th CPC

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతన నిర్మాణంలో మార్పులను సమీక్షించి సిఫార్సు చేయడానికి ఉద్దేశించిన 8వ కేంద్ర వేతన సంఘం (CPC) ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఈ నియామకానికి ఆమోదం తెలిపింది.

దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్ల అలవెన్సులు, పింఛన్ల అంశాలను ఈ కమిషన్ సమీక్షిస్తుంది. సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. 8వ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. కమిషన్ తన తుది నివేదికను త్వరలో సమర్పించాలని భావిస్తున్నారు.

జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్

  • కేంద్ర వేతన సంఘం చరిత్రలో మహిళా ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నియమితులవ్వడం విశేషం.

  • సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి 2014లో రిటైర్ అయ్యారు.

  • ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌర స్మృతి (UCC) ముసాయిదా కమిటీకి ఛైర్‌పర్సన్‌గా నేతృత్వం వహించారు. ఆ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా ఉత్తరాఖండ్ యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది.

  • జమ్మూ-కశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ (Delimitation Commission)కు కూడా అధ్యక్షురాలిగా పనిచేశారు.

  • ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI)కు ఛైర్‌పర్సన్‌గా సేవలు అందించారు.

8వ పే కమిషన్

8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం 2025 జనవరి 16న స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్రస్థాయిలోని కీలక శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈమేరకు సంప్రదింపులు జరిపింది. వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ ఈమేరకు ఏర్పాటు చేయనున్న ప్యానెల్‌లో ఆరుగురు సభ్యులు ఉంటారు. వారు 18 నెలల్లో తమ నివేదికను సమర్పిస్తారు. అయితే, ఈసారి త్వరగానే నివేదికను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. తద్వారా కొత్త సిఫార్సులను జనవరి 1, 2026 నుంచి అమలు చేసేందుకు వీలవుతుంది.

ఎవరిపై ప్రభావం?

ఎనిమిదో వేతన సంఘం దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా క్లర్కులు, ప్యూన్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) వంటి లెవల్ 1 హోదాల్లో ఉన్న వారు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంది. ప్రస్తుత 7వ సీపీసీ 31 డిసెంబర్ 2025తో ముగియనుంది. 2024 జనవరిలో 8వ సీపీసీని ప్రకటించినప్పటికీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)కు తాజాగా ఆమోదం తెలిపింది. ఇది పూర్తయి సభ్యులను నియమించే వరకు జీతాలు, అలవెన్సులు, పింఛన్లపై అధికారిక సమీక్ష మొదలుకాదని గమనించాలి.

ఇదీ చదవండి: వీసా, మాస్టర్ కార్డుకు రూపే గట్టి పోటీ.. కారణాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement