
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో, పన్ను నిపుణులు, పన్ను చెల్లింపుదారుల నుంచి గడువు పొడిగింపుపై డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా, బీజేపీకి చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు భర్తృహరి మహతాబ్ (కటక్), పీపీ చౌదరి (పాలీ) కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖలు రాసి గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఐటీఆర్ దాఖలుకు గడువు సెప్టెంబర్ 15న ముగియనుంది.
పొడిగింపు కోరడానికి కారణాలు
ఐటీఆర్-5, ఆడిట్ సంబంధిత ఫారాలతో సహా ఐటీఆర్ ఫారాలను విడుదల చేయడంలో జాప్యం జరిగింది. జూలై, ఆగస్టు నెలల్లో ఐటీఆర్ ఫారాలు అందుబాటులోకి వచ్చాయి.
ఐటీఆర్ పోర్టల్లో ధ్రువీకరణ లోపాలు, అప్‌లోడ్ నెమ్మదించడం, ఫారం 26ఏఎస్, ఏఐఎస్, టీఐఎస్‌లో అసమతుల్యత వంటి సాంకేతిక లోపాలు.
ఒడిశాలో వరదలతో సహా ప్రకృతి వైపరీత్యాలు, విద్యుత్తు, ఇంటర్నెట్ సదుపాయానికి అంతరాయం కలిగించాయి. దీంతో సకాలంలో ఐటీఆర్ దాఖలు చేయడం కష్టతరం చేసింది.
మరోవైపు పండుగ సీజన్ పరిమితులు.గణేష్ పూజ, దుర్గా పూజ, దసరా వంటి ప్రధాన సెలవుదినాలు సిబ్బంది లభ్యతను పరిమితం చేశాయి.
ఐసీఏఐ కొత్త ఫార్మాట్ల కారణంగా ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌ల తయారీకి అదనపు సమయం అవసరమవుతోంది.
ఏకకాలంలో ఏకకాలంలో జీఎస్టీ ఫైలింగ్స్, ఐటీఆర్ ఫైలింగ్ పన్ను నిపుణుల పనిభారాన్ని పెంచుతోంది.
ప్రతిపాదిత పొడిగింపులు
ఐటీఆర్ (నాన్-ఆడిట్) దాఖలుకు గడువు సెప్టెంబర్ 15 వరకు ఉండగా సెప్టెంబర్ 30 వరకు పొడింగించాలని కోరుతున్నారు. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ (TAR) గడువు సెప్టెంబర్ 30 ఉండగా అక్టోబర్ 31 వరకు, టీఏఆర్ తో ఐటీఆర్ ఫైలింగ్‌కు అక్టోబర్ 31 చివరి తేదీ కాగా నవంబర్ 30 పొడిగించాలని విజ్ఙప్తి చేస్తున్నారు. ఇక ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు గడువును కూడా డిసెంబర్ 31 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు పొడిగించాలని అభ్యర్థనలు వచ్చాయి.
విస్తృత మద్దతు
కర్ణాటక స్టేట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ (KSCAA), అడ్వకేట్స్ టాక్స్ బార్ అసోసియేషన్ (ATBA), ఐసీఏఐకి సంబంధించిన సెంట్రల్ ఇండియా రీజినల్ కౌన్సిల్ (CIRC) వంటి పన్ను నిపుణుల సంఘాలు కూడా గడువు పొడిగింపును కోరుతున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విజ్ఞప్తులను పరిశీలిస్తున్న నేపథ్యంలో, లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు, నిపుణులు అధికారిక నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.