ఇరాన్ ప్రతిపాదనలను తోసిపుచ్చిన ట్రంప్
విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాల ప్రభావం
సెన్సెక్స్ 1,313 పాయింట్లు క్రాష్
నిఫ్టీకి 360 పాయింట్ల నష్టం
రూ.6 లక్షల కోట్ల సంపద ఆవిరి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ప్రధాని మోదీ పొదుపు చర్యల గురించి చేసిన వ్యాఖ్యలతో దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం దాదాపు 1.5% పతనమైంది. డాలర్‌తో మారకంలో రూపాయి (95.28) సరికొత్త జీవితకాల కనిష్టానికి దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచాయి. సెన్సెక్స్ 1,313 పాయింట్లు క్షీణించి 76,015 వద్ద ముగిసింది. నిఫ్టీ 360 పాయింట్లు కోల్పోయి 23,816 వద్ద నిలిచింది. సూచీలు దాదాపు 2% పతనంతో స్టాక్ మార్కెట్లో రూ.6 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది.
ఫార్మా, హాస్పిటల్స్ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రంగాల వారీగా బీఎస్‌ఈ ఇండెక్సుల్లో కన్జూమర్ డ్యూరబుల్స్ 3.76%, రియల్టీ 2.74%, పీఎస్‌యూ బ్యాంక్స్ ఇండెక్స్ 2.28%, ప్రైవేట్ బ్యాంక్స్ ఇండెక్స్ 2.60%, కన్జూమర్ డి్రస్కేషనరీ 2.14%, విద్యుత్ 2.13% పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1.09%, 0.44 శాతం నష్టపోయాయి.
విదేశీ మారక నిల్వలు పొదుపు లక్ష్యంగా దేశ ప్రజలు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని ప్రధాని పిలుపుతో ఆభరణాల షేర్ల అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ 9.23%, శాన్కో గోల్డ్ 8.61%, త్రిభువన్‌దాస్ భీంజీ జవేరీ 7.52%, టైటాన్ 6.83%, స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ లిమిటెడ్స్ 6.63%, తంగమయిల్ జ్యువెలరీ 5.69%, పీసీ జ్యువెలర్ 4.94 శాతం పతనమయ్యాయి.
విదేశీ ప్రయాణాల విషయంలో నియంత్రణ పాటించాలని మోదీ కోరడంతో పర్యాటక, ప్రయాణ సంబంధిత సరీ్వసెస్, ఏవియేషన్ షేర్లు నేలచూపులు చూపాయి. యాత్ర ఆన్‌లైన్ 5.41%, థామస్ కుక్ 3.88%, ఈజీ ట్రిప్ ప్లానర్స్ 3.27% పతనమయ్యాయి. ఇండిగో 4.94%, స్పైస్‌జెట్ 4.72% నష్టపోయాయి.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకాన్ని వీలైనంత తగ్గించుకోవాలని ప్రధాని అభ్యర్థనతో ఎలక్ట్రిక్ వాహన కంపెనీల షేర్లకు డిమాండ్ నెలకొంది. ఏథర్ ఎనర్జీ 6%, జేబీఎం ఆటో 4.75%, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ 2.47%, ఒలక్ట్రా గ్రీన్‌టెక్ 2.16 శాతం రాణించాయి.
నష్టాలకు 4 కారణాలు
ప్రధాని పొదుపు పిలుపుతో కార్పొరేట్ సంస్థల ఆదాయంతో పాటు దేశ ఆర్థిక వృద్ధి కూడా నెమ్మదించే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే కారణంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిని సూచీలు ప్రభావితమయ్యాయి.
అమెరికా–ఇరాన్ శాంతి చర్చలు విఫలం: పశ్చిమాసియాలో నెలరోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా పంపిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. అందుకు ప్రతిస్పందనగా... లెబనాన్‌లో యుద్ధాన్ని ఆపాలని, యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని, తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ ఎదురు షరతులు విధించింది. అయితే, ఈ ప్రతిపాదనలు ‘అంగీకరించలేనివి అని అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో చర్చలు విఫలమయ్యాయి.
భగ్గుమన్న క్రూడాయిల్ ధరలు: అమెరికా–ఇరాన్ శాంతి చర్చల వైఫల్యంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా ఎగబాకాయి. బ్రెంట్ క్రూడ్ 4 శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు 105 డాలర్ల వద్దకు, నైమెక్స్ క్రూడ్ 3 శాతం వృద్ధితో 98 డాలర్లకు చేరుకుంది. తమ చమురు అవసరాల కోసం 85–90 శాతం దిగుమతులపైనే ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఈ పరిణామం పెను సవాలుగా మారింది. పెరిగిన ధరల వల్ల ద్రవ్యోల్బణం ఎగసి దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆగని విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు: దేశీయ స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు ఆగడం లేదు. వరుసగా అయిదో రోజూ నికర అమ్మకందారులుగానే కొనసాగారు. తాజాగా సోమవారం రూ. 8,437.56 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఈ నెల తొలి వారంలోనే రూ. 14,231 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
ఇదీ చదవండి: కరెన్సీ మార్కెట్లో ఆర్‌బీఐ జోక్యం తగ్గాలి


