భారత ఐటీ దిగ్గజాల షేర్లు నేలచూపులు...
ఏడాదిలో 30 శాతానికిపైగా పతనమైన టీసీఎస్
విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ వంటి సంస్థలదీ అదే దారి
రెండేళ్లలో ఏకంగా 300 రెట్లు పెరిగిన ఆంత్రోపిక్ ఆదాయం
ఏఐ వృద్ధి వేగాన్ని చూసి భయపడుతున్న భారత ఐటీ
మరోవంక దేశంలోనూ వేగంగా పెరుగుతున్న ఏఐ వాడకం
ఏఐ ఎకోసిస్టమ్‌లో ఎదుగుతున్న కొత్త తరహా కంపెనీలు
అవే భవిష్యత్ విజేతలుగా నిలుస్తాయంటున్న నిపుణులు
భారత ఐటీలో కొత్త అధ్యాయానికిది ఆరంభమంటూ వ్యాఖ్యలు
ఇన్వెస్టర్లు ఏం చేయాలనే దానిపై ‘సాక్షి వెల్త్’ ఫోకస్
ఒక స్టార్టప్. రెండేళ్ల కిందట దాని వార్షికాదాయం 10 కోట్ల డాలర్లు. మరిప్పుడు? ఏకంగా 3 వేల కోట్ల డాలర్లకు చేరబోతోంది. అమెరికన్ సిలికాన్ వాలీ దీన్ని పండగ చేసుకుంటుంటే... భారత ఐటీ రంగం వణికిపోతోంది. మన స్టాక్ మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. ఇంతకీ ఏంటా స్టార్టప్? మన మార్కెట్లతో సంబంధమేంటి? మన ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఇదే ఈ వారం సాక్షి వెల్త్ స్టోరీ. (రమణమూర్తి మంథా)
భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ షేరు గడిచిన ఏడాదిలో 30 శాతం పడిపోయింది. ఐదేళ్ల దీర్ఘకాలాన్ని తీసుకున్నా నెగెటివ్ రిటర్న్‌లే చూపిస్తోంది. కారణం... 2004లో లిస్టయిన తరవాత తొలిసారిగా ఈ ఏడాది కంపెనీ ఆదాయంలో వృద్ధి లేదు. పైగా క్షీణించింది. మరో దిగ్గజం ఇన్ఫోసిస్.. వచ్చే ఏడాది తమ ఆదాయ వృద్ధి 1.5 నుంచి 3 శాతాన్ని మించకపోవచ్చంటూ బలహీనమైన గైడెన్స్ ఇచ్చింది. వీటన్నిటినీ మించి ఐటీ రంగంలో హైరింగ్ దారుణంగా పడిపోయింది. వీటన్నిటికీ కారణం... ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్. సిలికాన్ వాలీ పండగ చేసుకుంటున్నది కూడా ఆంత్రోపిక్ అనే ఏఐ అద్భుతాన్ని చూసి. మన మార్కెట్లను భయపెడుతున్నది కూడా ఈ ఏఐనే. మరిపుడు మన ఇన్వెస్టర్లు ఏం చెయ్యాలి? మన ఐటీ స్టోరీ ముగిసినట్లేనా?
ఇది ముగింపు కాదు... కొత్త ఆరంభం
దీన్ని మన ఐటీ రంగం కథ ముగిసినట్లు కాకుండా కొత్త కథ ఆరంభంగా చూడాల్సిన అవసరముంది. ఎందుకంటే ఏఐ మన దేశంలోనూ కొత్త విజేతల్ని తయారు చేస్తోంది. ఏఐ ఇంజనీరింగ్, డేటా సెంటర్లు, సైబర్ సెక్యూరిటీ, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీ), ఇండ్రస్టియల్ ఏఐ, చిప్ తయారీ వ్యవస్థలకు సంబంధించిన కంపెనీలు మెల్లగా వెలుగులోకి వస్తు న్నాయి. ఈ కొత్త కంపెనీల రేస్ ఇప్పటికే మొదలైంది కూడా. ఆంత్రోపిక్ వేగానికి తీసిపోకుండా!!.
ఉద్యోగాలు రిస్కులో ఉన్నట్లేనా?
ఐటీ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఈ రంగంలో కొన్ని విభాగాల ఉద్యోగులు డేంజర్ జోన్‌లోకి వచ్చేశారు. ఆయా కంపెనీలు ఏఐని వాడటం మొదలుపెట్టే కొద్దీ వీరి అవసరం, ప్రాధాన్యం తగ్గిపోతుంటుంది కనక... ఇప్పుడు కాకుంటే కొన్నాళ్ల తరవాత అయినా వీరి ఉద్యోగం ప్రమాదంలో పడొచ్చన్నది నిపుణుల మాట. ప్రధానంగా టెస్టింగ్, బేసిక్ కోడింగ్, సపోరి్టంగ్ రోల్స్‌లో ఉండేవారు, డాక్యుమెంటేషన్ చేసేవారు,
బీపీఓ వాయిస్ ప్రాసెసింగ్‌లో ఉండేవారు ఈ ప్రమాదాన్ని త్వరగా ఎదుర్కొంటారనేది ఏఐ నిపుణుల వార్నింగ్.
టెస్టింగ్, డాక్యుమెంటేషన్, వాయిస్ ప్రాసెసింగ్ వంటి ఏఐ చేసే పనుల్లో ఉన్నవారు ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ... ఏఐ ఇంటిగ్రేషన్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇన్‌ఫ్రా, ఏఐ గవర్నెన్స్ వంటి విభాగాలలో భారీగా కొత్త ఉద్యోగాలు పుట్టుకు రాబోతున్నాయనే ది నిపుణుల మాట. ఎందుకంటే ఏఐ వాడకం పెరుగుతున్న కొద్దీ వీరి అవసరం కూడా పెరుగుతుంది. పైపెచ్చు ఏఐ వాడటంలో ఎదుర య్యే సవాళ్ల నుంచి మరిన్ని విభాగాలు పు ట్టుకొచ్చే అవకాశం కూడా ఉంది. సరే... ఇ దంతా ఉద్యోగాల గురించి అనుకుందాం.
మరి కంపెనీల మాటేంటి? ఇన్వెస్టర్ల సంగతేంటి?
టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ వంటి కంపెనీలు వీక్ గైడెన్స్, డీల్స్ నెమ్మదించటం, వృద్ధి తగ్గిపోవటం వంటి కారణాల వల్ల ఇప్పటికే బాగా నష్టపోయాయి. కాకపోతే కొన్ని మధ్య తరహా ఐటీ కంపెనీలు, ఏఐపై దృష్టి పెట్టిన కంపెనీలు ఈ పతనాన్ని తట్టుకుని నిలబడ్డాయి. ఏఐని వేగంగా అందుకోవటం, పాత కాలపు కాంట్రాక్టులను తగ్గించుకోవటం, డిజిటల్‌పై ఎక్కువగా దృష్టి పెట్టడం వీటిని కొత్త విజేతలుగా మారుస్తున్నాయి.
అలాంటి కంపెనీల్లో కొన్ని...
పర్సిస్టెంట్ సిస్టమ్స్: బలమైన ఏఐ, క్లౌడ్-డిజిటల్ ఇంజినీరింగ్
ఎల్‌టీఎం (మైండ్‌ట్రీ): ఏఐ ఆధారిత మార్పును త్వరగా అందుకోవటం
కోఫోర్జ్: డిజిటల్‌పై ఫోకస్, ప్రత్యేకమైన నైపుణ్యం
ఎంఫసిస్: బీఎఫ్‌ఎస్‌ఐ + క్లౌడ్ ట్రాన్స్‌ఫర్మేషన్
కేపీఐటీ: ఆటో సాఫ్ట్‌వేర్ + ఎంబెడెడ్ సిస్టమ్స్
ఏఐ దిశగా జరుగుతున్న మార్పుల్లో కొన్ని మధ్యశ్రేణి కంపెనీలు దిగ్గజాల్ని మించి పెరిగే అవకాశముందన్నది విశ్లేషకుల మాట.
భవిష్యత్ విజేతలు ఇవేనా..?
ఏఐ ఇన్‌ఫ్రా రంగంలోని కంపెనీలు డేటా సెంటర్లు, జీపీయూలు, క్లౌడ్ ఇన్‌ఫ్రా, నెట్‌వర్కింగ్, సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌లోని సంస్థలు ఈ పరిధిలోకి వస్తాయి.
నెట్‌వెబ్ టెక్నాలజీస్, తేజస్ నెట్‌వర్క్స్, సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీ, కేనెస్ టెక్నాలజీ వంటి సంస్థలు ఈ రంగంలో ఉన్నాయి.
ఇంజినీరింగ్, ఆర్ అండ్ డీ కంపెనీలు ఏఐ వృద్ధి చెందాలంటే దానికి చిప్ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఏరోస్పేస్, ఇండ్రస్టియల్ ఆటోమేషన్ కావాలి.
కేపీఐటీ టెక్నాలజీస్, టాటా ఎలెక్సీ, సైయంట్ వంటి సంస్థలు ఈ రంగంలో ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ, ఏఐ గవర్నెన్స్ కంపెనీలు ఏఐని ఉపయోగించటం పెరుగుతున్న కొద్దీ ఏఐ సెక్యూరిటీ, అమలు, గవర్నెన్స్, ఆడిట్ సిస్టమ్స్ వేగంగా పెరగాల్సిన అవసరముంది.
దీంతో పాటు వెండర్లకు పనులు ఔట్‌సోర్సింగ్‌పై ఇవ్వటం కన్నా గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల (జీసీసీ) అవసరం పెరుగుతుంది. మొత్తం ప్రాజెక్టుల్ని ఔట్‌సోర్సింగ్‌కి ఇచ్చే బదులు భారత కంపెనీలు నేరుగా ఏఐ టీమ్స్‌ను తయారు చేసుకోవటం మొదలుపెడతాయి. వీటిని ఏ కంపెనీలు త్వరగా అందిపుచ్చుకుంటే అవి విజేతలుగా మారతాయి.
దీన్నిబట్టి అర్థమయ్యేది ఒక్కటే. భారత ఐటీ రంగం రికవరీ కాకుండా పోదు. కాకపోతే మునుపటిలా కాదు. ఎక్కువ మంది ఉద్యోగులుంటే ఎక్కువ రెవెన్యూ వస్తుందనే మాదిరి కాకుండా ఏఐని ఎక్కువగా ఏ కంపెనీలైతే అందిపుచ్చుకుంటాయో అవి వేగంగా పెరుగుతాయి. కొత్త ఐటీ విజేతలు పుట్టుకొస్తాయి.
పాత మోడల్...
ఎక్కువమంది ఉద్యోగులంటే ఎక్కువ ఆదాయం వస్తుంది.
ఎన్ని గంటలు పనిచేస్తే అంత బిల్లింగ్. అంటే ఇక్కడ సమయానికే విలువ.
పెద్ద పెద్ద క్యాంపస్‌లు తప్పనిసరి. క్యాంపస్ సైజును బట్టే కంపెనీకి విలువ.
యూనివర్సిటీ, కాలేజీ క్యాంపస్‌లకు వెళ్లి ఫ్రెషర్స్‌ను తీసుకోవటం సంప్రదాయం.
కొత్త విజేతల తీరు...
ఏఐ ప్రొడక్టివిటీని ఎంత పెంచితే... రెవెన్యూ అంత పెరుగుతుంది.
ఫలితాన్ని బట్టే బిల్లింగ్. ఆ పనిని గంటల్లో చేసినా... రోజుల్లో చేసినా తేడా లేదు.
చిన్న చిన్న ఏఐ టీమ్‌లుంటాయి. ఆ టీమ్ చేసే పనే కంపెనీ విలువను నిర్దేశిస్తుంది.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఇలా ఏ విధానమైనా... ఏఐ స్పెషలిస్టుల్నే తీసుకుంటారు.


