పదేళ్ల కనిష్టానికి బ్యాంకుల ఎన్‌పీఏలు

Indian banks gross NPAs likely to touch decadal low of sub 4 percent by FY24 - Sakshi

2024 మార్చి నాటికి 4 శాతంలోపునకు

అసోచామ్‌ క్రిసిల్‌ రేటింగ్‌ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: దేశ బ్యాంకింగ్‌ రంగం ఎన్‌పీఏలు (వసూలు కాని రుణాలు) 2024 మార్చి నాటికి 4 శాతంలోపునకు దిగొస్తాయని అసోచామ్‌–క్రిసిల్‌ అధ్యయన నివేదిక తెలిపింది. ఇది దశాబ్ద కనిష్ట స్థాయి అని పేర్కొంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 0.90 శాతం తగ్గి స్థూల ఎన్‌పీలు 5 శాతంలోపుగా ఉండొచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి అనంతరం ఆర్థిక రంగ కార్యకలాపాలు కోలుకోవడం, రుణాల్లో అధిక వృద్ధి ఎన్‌పీఏలు తగ్గేందుకు అనుకూలించినట్టు వివరించింది.

ప్రధానంగా కార్పొరేట్‌ రుణాల వైపు ఎంతో పురోగతి ఉన్నట్టు తెలిపింది. కార్పొరేట్‌ రుణాల్లో స్థూల ఎన్‌పీఏలు 2024 మార్చి నాటికి 2 శాతంలోపు ఉంటాయని పేర్కొంది. 2018 మార్చి నాటికి కార్పొరేట్‌ ఎన్‌పీఏలు 16 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. ‘‘ఇటీవలి సంవత్సరాల్లో బ్యాంకులు తమ పుస్తకాలను ప్రక్షాళన చేసుకున్నాయి. రిస్క్‌ నిర్వహణ, అండర్‌ రైటింగ్‌ను బలోపేతం చేసుకున్నాయి. ఈ చర్యల నేపథ్యంలో క్రెడిట్‌ ప్రొఫైల్‌ మెరుగ్గా ఉన్న రుణ గ్రహీతలకు బ్యాంకులు ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెట్టాయి.

కార్పొరేట్‌ రుణ ఆస్తుల నాణ్యత అదే పనిగా మెరుగు పడుతూ రావడం అన్నది బ్యాంకుల రుణాల నాణ్యతను తెలియజేస్తోంది’’అని అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ దీపక్‌ సూద్‌ వివరించారు. బహుళ బ్యాలన్స్‌షీట్‌ సమస్య దాదాపుగా పరిష్కారమైనట్టేనని, రుణాల వృద్ధి గణనీయంగా మెరుగుపడడం మొదలైనట్టు చెప్పారు. అంతర్జాతీయ సవాళ్ల మధ్య మన బ్యాంకింగ్‌ రంగం ఎంతో బలంగా ఉన్నట్టు సూద్‌ గుర్తు చేశారు. కరోనా వల్ల ఎక్కువగా దెబ్బతిన్న ఎంఎస్‌ఎంఈ రంగానికి సంబంధించి రుణాల్లో ఎన్‌పీఏలు.. 2022 మార్చి నాటికి ఉన్న 9.3 శాతం నుంచి 2024 మార్చి నాటికి 10–11 శాతానికి పెరుగుతాయని ఈ నివేదిక తెలిపింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top