
ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లలో వేగంగా ఎదుగుతున్న గ్లోబల్ ఈవీ తయారీదారుల్లో ఒకటైన టెస్లా, విన్‌ఫాస్ట్ ఇటీవలే భారత్‌లోకి ప్రవేశించాయి. గత నెలలో ఈ రెండు దిగ్గజ సంస్థలు తమ తొలి బ్యాచ్ వాహన రిజిస్ట్రేషన్లను నమోదు చేశాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వాహన్ (Vaahan) పోర్టల్ డేటా ప్రకారం సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా మొత్తం 60 టెస్లా కార్లు, 6 విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి.
జులైలో భారతీయ కార్యకలాపాలను ప్రారంభించిన తర్వాత ఈ రెండు కంపెనీలకు ఇది మొదటి అధికారిక బ్యాచ్ రిజిస్ట్రేషన్లు కావడం గమనార్హం. అంతర్జాతీయంగా ఈవీ మార్కెట్‌ను శాసిస్తున్న టెస్లా జులై 15న ముంబైలో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. దీని మోడల్ వై ఎస్‌యూవీ ధరలు రియర్-వీల్ డ్రైవ్ వెర్షన్‌కు రూ.59.89 లక్షలు, లాంగ్-రేంజ్ వేరియంట్ రూ.67.89 లక్షల నుంచి ప్రారంభమయ్యాయి. ఇది సుమారు 500 కి.మీ. వరకు రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.
మరోవైపు వియత్నాం ఈవీ తయారీదారు విన్‌ఫాస్ట్ మిడ్-రేంజ్ మార్కెట్‌పై దృష్టి సారించింది. కంపెనీ ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించడమే కాకుండా స్థానిక తయారీకి భారీ పెట్టుబడిని ప్రకటించింది. తమిళనాడులోని తూత్తుకుడిలో నెలకొల్పిన విన్‌ఫాస్ట్ అసెంబ్లీ ప్లాంట్ ఆగస్టులో కార్యకలాపాలను మొదలుపెట్టింది. దీని ప్రారంభ సామర్థ్యం ఏటా 50,000 వాహనాలుగా ఉంది. దీనిని 1.5 లక్షల యూనిట్ల వరకు పెంచే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: సంద్రంలో వ్యక్తి ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్