డేట్ ఫిక్స్.. ఇండియాలో టెస్లా ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అక్కడే | Tesla to Inaugurate First Charging Station in India on August 4th | Sakshi
Sakshi News home page

డేట్ ఫిక్స్.. ఇండియాలో టెస్లా ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అక్కడే

Aug 2 2025 9:31 AM | Updated on Aug 2 2025 11:38 AM

Tesla to Inaugurate First Charging Station in India on August 4th

అమెరికన్‌ కార్ల దిగ్గజం 'టెస్లా' భారత మార్కెట్లో తమ మొట్టమొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. కాగా ఇప్పుడు మొదటి ఛార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించడానికి సన్నద్ధమైంది. టెస్లా వై కారును ఆవిష్కరించిన తరువాత.. కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

టెస్లా భారతదేశంలో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ స్టేషన్‌ను ఆగస్టు 4న బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ప్రారభించనుంది. కొత్త టెస్లా ఛార్జింగ్ హబ్‌లో మొత్తం ఎనిమిది ఛార్జింగ్ యూనిట్లు ఉంటాయి. ఇందులో నాలుగు వీ4 సూపర్‌చార్జర్‌లు (DC ఫాస్ట్ ఛార్జర్‌లు), నాలుగు డెస్టినేషన్ ఛార్జర్‌లు (AC ఛార్జర్‌లు).

వీ4 సూపర్‌చార్జర్‌లు kWhకి రూ.24, డెస్టినేషన్ ఛార్జర్‌లు kWhకి రూ.14 చొప్పున ఛార్జ్‌ ఉంటుంది. V4 సూపర్‌చార్జర్‌లు మోడల్ Y కి 15 నిమిషాల్లో 267 కిలోమీటర్ల పరిధిని అందించడానికి కావాల్సిన ఛార్జ్ చేయగలదని టెస్లా పేర్కొంది. అంటే టెస్లా వై కారుకు 15 నిముషాలు సూపర్‌చార్జర్‌ ద్వారా ఛార్జ్ చేస్తే.. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం& గేట్‌వే ఆఫ్ ఇండియా మధ్య ఐదు ట్రిప్పులు తిరగవచ్చని కంపెనీ వెల్లడించింది.

టెస్లా మోడల్ వై
భారతదేశంలో టెస్లా మోడల్ వై కారును ప్రారంభించిన తరువాత.. కంపెనీ బుకింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కారును ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై నగరాల్లో మాత్రమే బుక్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో సంస్థ మరిన్ని నగరాలకు విస్తరించనుంది.

టెస్లా ఎంట్రీ-లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్‌పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్‌పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్‌లు దాదాపు 295 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement