ఏఐ వినియోగానికి భారత్‌ సారథ్యం | india poised lead global ai adoption microsoft jay parikh | Sakshi
Sakshi News home page

ఏఐ వినియోగానికి భారత్‌ సారథ్యం

May 27 2026 5:56 PM | Updated on May 27 2026 6:15 PM

india poised lead global ai adoption microsoft jay parikh

అంతర్జాతీయంగా కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంలో తదుపరి దశకి సారథ్యం వహించేందుకు భారత్‌ సర్వసన్నద్ధంగా ఉందని టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (కోర్‌ఏఐ) జయ్‌ పారిఖ్‌ తెలిపారు. దేశీయంగా డెవలపర్ల లభ్యత భారీ స్థాయిలో ఉండటం, కంపెనీలు ఏఐ వినియోగాన్ని వేగవంతం చేయడం మొదలైనవి సానుకూలాంశాలని వివరించారు. భారత్‌లో రూపొందిన హైపర్‌స్విచ్, ఈఆర్‌పీనెక్ట్స్, టూల్‌జెట్, బ్రూనో లాంటి ఓపెన్‌ సోర్స్‌ ప్రాజెక్టులను ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు ఉపయోగిస్తున్నారని ఓ బ్లాగ్‌పోస్ట్‌లో పారిఖ్‌ పేర్కొన్నారు.

‘ఏఐ తదుపరి దశ అనేది అత్యుత్తమ మోడల్స్‌ని ఎవరు రూపొందిస్తున్నారనే అంశంపై కాకుండా వాస్తవ ప్రపంచంలో ప్రభావవంతంగా పని చేసేలా, విశ్వసనీయతతో, వేగవంతంగా ఎవరు వినియోగంలోకి తేగలగుతారనే విషయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ పరివర్తనకి సారథ్యం వహించడానికి భారత్‌ సర్వసన్నద్ధంగా ఉంది‘ అని తెలిపారు. డెలాయిట్‌ నిర్వహించిన 2026 సర్వే ప్రకారం విస్తృత స్థాయిలో ఏఐ వినియోగిస్తున్న 15 దేశాల జాబితాలో భారత్‌కి అగ్రస్థానం దక్కడం ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 40 శాతం ఎంటర్‌ప్రైజ్‌లు ఏఐని గణనీయంగానో లేదా పూర్తి స్థాయిలోనో వినియోగిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా ఇది సగటున 28 శాతంగా ఉంది.  

పటిష్టంగా డిజిటల్‌ మౌలిక సదుపాయాలు.. 
దేశీయంగా డిజిటల్‌ పబ్లిక్‌ మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటం భారత్‌కి మరో సానుకూలాంశమని పారిఖ్‌ చెప్పారు. ‘భారత్‌లో డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (డీపీఐ) పటిష్టంగా ఉంటోంది. గత దశాబ్దకాలంలో గుర్తింపు ధృవీకరణ వ్యవస్థ, చెల్లింపుల వ్యవస్థ, డేటా ప్లాట్‌ఫాంలను భారత్‌ విస్తృత స్థాయిలో తీర్చిదిద్దింది. డిజిటల్‌ చెల్లింపుల విధానమైన యూపీఐ ప్రస్తుతం నెలకు 2,000 కోట్ల పైగా లావాదేవీలను ప్రాసెస్‌ చేస్తోంది. ఇది అంతర్జాతీయంగా జరిగే రియల్‌ టైమ్‌ చెల్లింపుల్లో దాదాపు సగం. డీపీఐతో ఏఐ అనుసంధానమవుతున్న నేపథ్యంలో ఆర్థిక సేవల నుంచి వైద్యం, విద్య వరకు అన్నింటా కృత్రిమ మేథ కీలక పాత్ర పోషించనుంది. తద్వారా ప్రపంచంలోనే తొలి భారీ ఏఐ పబ్లిక్‌ ఇన్‌ఫ్రా వ్యవస్థగా భారత్‌ ఎదగనుంది‘ అని పారిఖ్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement