
అదనంగా 50 మిలియన్ చ.అ. అవసరం
2030 నాటికి అంచనాలు
డెలాయిట్ నివేదిక
న్యూఢిల్లీ: దేశీయంగా కృత్రిమ మేథకు డిమాండ్‌తో డేటా సెంటర్లు గణనీయంగా పెరగనున్న నేపథ్యంలో 2030 నాటికి అదనంగా 45–50 మిలియన్ చ.అ. రియల్ ఎస్టేట్ అవసరం ఏర్పడనుంది. అలాగే 40–45 టెరావాట్–అవర్స్ (టీడబ్ల్యూహెచ్) విద్యుత్ కూడా కావాల్సి రానుంది. ‘భారత ఏఐ డేటా సెంటర్ మౌలిక సదుపాయాల్లోకి పెట్టుబడుల ఆకర్షణ’ పేరిట డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
వ్యయాలపరమైన ప్రయోజనాలు, పునరుత్పాదక విద్యుత్‌పై ప్రధానంగా దృష్టి పెట్టడం, వ్యూహాత్మక స్థానంలో ఉండటం తదితర అంశాలు భారత్‌కి సానుకూలాంశాలని వివరించింది. అయితే, అంతర్జాతీయంగా ఏఐ హబ్‌గా ఎదగాలంటే కీలకమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం, నిపుణుల లభ్యత, విధానాల్లో అంతరాలను తొలగించడం మొదలైనవి ప్రధానంగా ఉంటాయని పేర్కొంది. ప్రపంచ స్థాయి ఏఐ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే రియల్ ఎస్టేట్, విద్యుత్, కనెక్టివిటీ, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు, నిపుణులు, విధానాలు అనే ఆరు అంశాలు మూల స్తంభాలుగా ఉంటాయని నివేదిక తెలిపింది. నేషనల్ బిల్డింగ్ కోడ్‌లో డేటా సెంటర్ల కోసం ప్రత్యేక కేటగిరీని ఏర్పాటు చేయాలని సూచించింది.
నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..
→ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు అనుమతుల ప్రక్రియను సరళతరం, వేగవంతం చేయాల్సి ఉంటుంది.
→ విధానాలపరంగా మద్దతు కలి్పంచాలి. డేటా లోకలైజేషన్ నిబంధనలను క్రమబద్ధీకరించాలి. ప్రత్యేక డేటా సెంటర్ జోన్లను ఏర్పాటు చేయాలి. ఇవి భారతదేశ ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు తోడ్పడతాయి.
→ డేటా సెంటర్ల వేగవంతమైన విస్తరణ వల్ల పవర్ గ్రిడ్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు అత్యవసరంగా భారీ స్థాయిలో పెట్టుబడులు అవసరమవుతాయి.
→ దేశీయంగా నెట్‌వర్క్, ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌పరంగా పరిమితులు, గట్టిగా ఆధారపడలేని హై–స్పీడ్ ఇంటర్నెట్ మొదలైన వాటి పరిమితుల వల్ల డేటా సెంటర్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఉండొచ్చు.