
2030 నాటికి అంచనాలు
ఏఐ, క్లౌడ్ వినియోగం దన్ను
ఎవెండస్ క్యాపిటల్ అధ్యయనంలో వెల్లడి
ముంబై: దేశీయంగా డేటా సెంటర్ల రంగం భారీ స్థాయిలో విస్తరిస్తోంది. 2030 నాటికి ఏకంగా 3 గిగావాట్ల సామర్థ్యాన్ని సంతరించుకుంటుందనే అంచనాలు నెలకొన్నాయి. ఎవెండస్ క్యాపిటల్ రూపొందించిన మల్టీ ఇయర్ గ్రోత్ ప్రాక్సీ ఆన్ ఇండియాస్ డేటా ఎక్స్‌ప్లోజన్ అండ్ లోకలైజేషన్ వేవ్ పేరిట ఎవెండస్ క్యాపిటల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2024లో దేశీయంగా డేటా సెంటర్ల సామర్థ్యం 1.1 గిగావాట్లుగా ఉంది.
డేటా, ఏఐ, క్లౌడ్ వినియోగం పెరుగుతుండటం, డేటా లోకలైజేషన్ ప్రధాన లక్ష్యంగా తీసుకుంటున్న పాలసీపరమైన చర్యలు లాంటి అంశాలు డేటా సెంటర్లకు కీలక చోదకాలుగా ఉండనున్నాయి. దీనితో 2033 నాటికి డిమాండ్ 6 గిగావాట్ల స్థాయికి చేరే అవకాశం ఉంది. అయితే, సరఫరా మాత్రం 4.5 గిగావాట్ల స్థాయికే పరిమితం కానుంది. దీంతో 1.5 గిగావాట్ల మేర డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం ఏర్పడనుంది. లార్జ్ ఫార్మాట్, హైపర్‌స్కేల్ రెడీ మౌలిక సదుపాయాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో తక్కువ లేటెన్సీతో వర్క్‌లోడ్ భారాన్ని భరించగలిగే ఎడ్జ్–రెడీ సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా ఈ డిమాండ్‌ను తీర్చే అవకాశం ఉంది. దీంతో ఈ పరిశ్రమ వార్షికంగా 25–30 శాతం మేర వృద్ధి నమోదు చేయనుంది.
భారీగా పెట్టుబడులు..
డేటా సెంటర్ల వృద్ధికి అపార అవకాశాలు నెలకొన్న నేపథ్యంలో ఈ పరిశ్రమలోకి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. ప్రస్తుతం ఏటా 1–1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 12,870 కోట్లు) స్థాయిలో వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పెట్టుబడులు రెట్టింపు కానున్నాయి. వివిధ రాష్ట్రాలు సబ్సిడీ రేటుకు స్థలాన్ని, విద్యుత్తును తక్కువ రేటుకు అందిస్తుండటం వంటి అంశాలు దేశవ్యాప్తంగా డేటా సెంటర్లు వేగంగా వృద్ధి చెందడానికి దోహదపడుతున్నాయి. ఇప్పటికే ఎస్‌టీటీ జీడీసీ, సిఫీలాంటి దిగ్గజాలుఈ రంగంలో స్థానాన్ని పటిష్టం చేసుకోగా, పెరుగుతున్న డిమాండ్‌ని తీర్చే దిశగా మరిన్ని కొత్త సంస్థలు కూడా వస్తున్నాయి.
ఢిల్లీ–ఎన్‌సీఆర్‌కి చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ సంస్థ అనంత్ రాజ్ భారీ పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. 2031–32 నాటికి నిర్వహణ సామర్థ్యాలను 307 మెగావాట్లకు పెంచుకునేందుకు 2.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 18,000 కోట్లు) వెచ్చించనుంది. 2025–26లో డేటా సెంటర్ సామర్థ్యం 28 మెగావాట్లుగా ఉండనుంది. డేటా సెంటర్ల కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ విధానాల తోడ్పాటు, విద్యుత్ లభ్యత, కనెక్టివిటీ మొదలైన అంశాలన్నీ కూడా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ క్లయింట్ల నుంచి ఎంటర్‌ప్రైజ్, హైపర్‌స్కేలర్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ లాంటి వాటికి పెరుగుతున్న డిమాండ్‌ని తీర్చేందుకు పరిశ్రమ సన్నద్ధంగా ఉందని అనంత్ రాజ్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ సరీన్ తెలిపారు.