వ్యవసాయం తర్వాత రియల్ ఎస్టేటే.. | Construction Sector Registers 11 97pc Growth in Telangana Minister Sridhar Babu | Sakshi
Sakshi News home page

వ్యవసాయం తర్వాత రియల్ ఎస్టేటే..

Oct 12 2025 7:49 PM | Updated on Oct 12 2025 7:52 PM

Construction Sector Registers 11 97pc Growth in Telangana Minister Sridhar Babu

నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్‌ బాబు

నిర్మాణ రంగ వృద్ధి రేటు 11.97 శాతం

సెప్టెంబర్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లలో 35 శాతం పెరుగుదల

రెండు, మూడు నెలల్లో ‘ఏఐ’ సిటీకి భూమి పూజ

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

‘2024-25లో రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవల రంగం 15.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. 11.97 శాతం వృద్ధి రేటుతో నిర్మాణ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.80వేల కోట్లకు పైగా సమకూర్చింది. స్టేట్ సర్వీసెస్ జీఎస్డీపీలో ఈ రెండు రంగాల వాటానే 24.9 శాతంగా ఉంది’ అని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలెప్ మెంట్ కౌన్సిల్(నారెడ్కో) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో హైటెక్స్ లో నిర్వహిస్తున్న ‘15వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో’లో ఆయన ఆదివారం పాల్గొని ప్రసంగించారు.

‘హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలో 2024 సెప్టెంబర్ లో రూ.2820 కోట్ల విలువైన 4903 ఇళ్ల రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో రూ.4804 కోట్ల విలువైన 6612 ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఇది 35 శాతం అధికం. విలువలో వార్షిక వృద్ధి 70 శాతంగా నమోదయ్యింది. ఇవి కేవలం గణాంకాలు కాదు... రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలయ్యిందంటూ మాపై దుష్ర్పచారం చేస్తున్న వారికి ధీటైన సమాధానాలు’ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

‘ఈ సెప్టెంబర్ లో రూ.కోటిపైన విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్లలో 151 శాతం పెరుగుదల ఉంది. మొత్తం విక్రయాల్లో విలువ పరంగా వీటి వాటానే 53 శాతం’ అని చెప్పారు. ‘భారత్ లో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. అయితే... అభివృద్ధి చెందిన దేశాల జీడీపీలో స్థిరాస్తి రంగ వాటా సగటున 10 శాతం 15 శాతం కాగా... చైనాలో అత్యధికంగా 23 శాతం నుంచి 25 శాతం వరకుంది. మన దేశంలో ఇది 6 శాతం నుంచి 8 శాతమే. ఇది మరింత పెరగాల్సిన అవసరముంది’ అని అభిప్రాయపడ్డారు.

‘ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో ఫేజ్ 2, భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ సుందరీకరణ, రీజినల్ రింగ్ రోడ్డు తదితర ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రూపురేఖలు మారిపోనున్నాయి. డిసెంబర్ నాటికి ‘ఫ్యూచర్ సిటీ’లో జోనలైజేషన్ ప్రక్రియను పట్టలెక్కించాలనే పట్టుదలతో ఉన్నాం. అక్కడే 200 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్న ఏఐ సిటీకి రెండు, మూడు నెలల్లోనే భూమి పూజ చేయబోతున్నాం’ అని వివరించారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నారెడ్కో తెలంగాణ ప్రతినిధులు విజయసాయి మేక, కాళీ ప్రసాద్ దామెర, డా.లయన్ కిరణ్, కె.శ్రీధర్ రెడ్డి, ఆర్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement