
విద్యుత్ శాఖకు చుక్కలు చూపిస్తున్న బిగ్ డేటా కేంద్రాలు
ఒక్కో కేంద్రానికి 500 మెగావాట్లు అవసరం
బిగ్ డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
వీటితో రెట్టింపుకానున్న డిమాండ్.. విద్యుత్ శాఖ గుబులు.. బొగ్గు కొరతపై జెన్‌కో ఆందోళన
డిమాండ్‌ను అందుకోవాలని విద్యుత్ శాఖను ఆదేశించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాష్ట్ర విద్యుత్ శాఖకు షాక్ ఇస్తోంది. అంచనాలకు మించిన విద్యుత్ డిమాండ్‌ను సృష్టిస్తుంది. అన్ని సాఫ్ట్‌వేర్ సంస్థలూ ఏఐతో కనెక్ట్ అవుతుండటంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డేటా కేంద్రాలు పెరుగుతున్నాయి. బిగ్ డేటా కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వస్తున్నాయి.
ఒక్కోటి 500 మెగావాట్ల కెపాసిటీ విద్యుత్‌ను ఉపయోగించే స్థాయిలో ఉంటాయని అంచనా. ఇది జెన్‌కోలో ఒక ప్లాంట్ సామర్థ్యంతో సమానం. ఇదే ఇప్పుడు విద్యుత్ శాఖకు గుబులు పుట్టిస్తోంది. అయితే, విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేలా చేయాలని విద్యుత్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
ఏం చేద్దాం?
రాష్ట్రంలో పీక్ సమయంలో 15497 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. 2034 నాటికి ఇది 33773 మెగావాట్లకు చేరుతుందని అంచనా. డిమాండ్‌లో ప్రధాన భూమిక ఐటీ కేంద్రాలదే. ముఖ్యంగా డేటా కేంద్రాల వల్లే డిమాండ్ పెరిగే వీలుంది. విద్యుత్ లభ్యతను పెంచకపోతే ప్రతిపాదిత డేటా కేంద్రాలు వెనక్కుపోయే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అత్యవసర ప్రణాళిక రూపకల్పనకు ప్రభుత్వం విద్యుత్ శాఖను ఆదేశించింది.
కొత్తగా వచ్చి న యాదాద్రితో కలుపుకొంటే 5580 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ కేంద్రాలున్నాయి. 70 శాతం లోడ్ ఫ్యాక్టర్‌తో పనిచేసినా ఇవి 109 మిలియన్ యూనిట్లు ఇవ్వగలవు. అయితే, బొగ్గు కొరత, తరచూ బ్యాక్‌డౌన్ కారణంగా గరిష్టంగా రోజుకు 60 మిలియన్ యూనిట్లే ఇస్తున్నాయి. పీక్ సమయంలో రాష్ట్రంలో రోజుకు 308 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటోంది. డేటా కేంద్రాల ఏర్పాటుతో డిమాండ్ రెట్టింపు అయితే రోజుకు 600 మిలియన్ యూనిట్లు కావాలి.
ఈ నేపథ్యంలో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు జెన్‌కో మార్గాన్వేషణకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం యాదాద్రి పవర్ ప్లాంట్‌ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయడం జెన్‌కోకు కీలకం. దీని సామర్థ్యం 4 వేల మెగావాట్లు. ఇక్కడ 55 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉంటే తప్ప ముందుకెళ్లలేని పరిస్థితి. ఈ బొగ్గుపై సింగరేణి సంస్థ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం 4 ర్యాకులతో బొగ్గు సరఫరా జరుగుతోంది. దీన్ని 14 రేకులకు పెంచాలి. దీంతో జెన్‌కో అధికారులు రైల్వే, సింగరేణితో భేటీకి సన్నద్ధమవుతున్నారు.
కొనుగోలు తప్పదా?
ప్రస్తుతం రోజుకు 300 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ డిమాండ్ ఉంటేనే... మార్కెట్లో విద్యుత్ కొనాల్సి వస్తోంది. జెన్‌కో థర్మల్ 57, హైడల్ 25, సింగరేణి నుంచి 23 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుతోంది. రోజూ 149 మిలియన్ యూనిట్లు కేంద్ర సంస్థలు, మార్కెట్ నుంచి సమకూర్చుకుంటున్నారు. మధ్యా హ్నం యూనిట్ గరిష్టంగా రూ.2.5కు లభిస్తున్నా, రాత్రిపూట మాత్రం యూనిట్ రూ.8 వరకూ వెళ్తోంది. రాబోయే రోజుల్లో రోజుకు 600 ఎంయూ డిమాండ్ ఉంటే... ధర ఎంత ఉన్నా మార్కెట్ నుంచి భారీగా కొనుగోలుచేయాల్సి రావొచ్చు.
డిమాండ్ అందుకుంటాం
కేంద్ర విద్యుత్ సంస్థల అంచనాను మించి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఐటీ కేంద్రాల్లో వస్తున్న మార్పులూ కారణమే. అయితే, డిమాండ్‌ను అందుకునేందుకు జెన్‌కో అన్నివిధాలా సిద్ధమతోంది. యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెస్తాం. ఇతర ప్లాంట్లలోనూ ఉత్పత్తి పెంచుతాం. ఎంత డిమాండ్ పెరిగినా అందుకోగల సామర్థ్యం జెన్‌కోకు ఉంది. –ఎస్.హరీశ్, సీఎండీ, తెలంగాణ జెన్‌కో