కరోనా కష్టంతో 9.6% క్షీణత

India is Economy to Contract by 9.6 percent in 2020-21 - Sakshi

2020–21 భారత్‌ ఎకానమీపై ప్రపంచ బ్యాంక్‌ అంచనా

వాషింగ్టన్‌: భారత్‌ ఆర్థిక వ్యవస్థ 2020 (ఏప్రిల్‌)–2021 (మార్చి) ఆర్థిక సంవత్సరంలో 9.6 శాతం క్షీణతను నమోదుచే సుకుంటుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనావేస్తోంది. కరోనా కట్టడికి విధించిన కఠిన లాక్‌డౌన్‌ పరిస్థితులు, గృహాలు, పరిశ్రమల ఆదాయాలు పడిపోవడం వంటి అంశాలు దీనికి కారణంగా వివరించింది. ‘దక్షిణాసియా ఆర్థిక పరిస్థితిపై దృష్టి’ పేరుతో  గురువారంనాడు విడుదలైన ప్రపంచబ్యాంక్‌ నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. భారత్‌ ఇంతకుముందెన్నడూ లేని దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోందని పేర్కొంది. తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) భారత స్థూల దేశీయోత్పత్తి  23.9 శాతం క్షీణించిన నేపథ్యంలో ప్రపంచబ్యాంక్‌ తాజా నివేదిక విడుదలైంది. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వార్షిక సమావేశాల నేపథ్యంలో విడుదలైన నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు...

► దక్షిణాసియా ప్రాంతం ఆర్థిక వ్యవస్థ గడచిన ఐదేళ్ల నుంచీ వార్షికంగా 6 శాతం వృద్ధి నమోదుచేసుకోగా,  2020లో 7.7 శాతం క్షీణించనుంది. అయితే 2021లో ఈ ప్రాంతం 4.5 శాతం వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉంది.  
► కరోనా వైరస్‌ ప్రభావంతో భారత్‌లో సరఫరాలు–డిమాండ్‌ పరిస్థితుల మధ్య సమతౌల్యత పూర్తిగా దెబ్బతింది.  
► వృద్ధికి మౌలిక రంగంలో పెట్టుబడులు అవసరం. అయితే ఇప్పుడు ద్రవ్య వనరులను ఆరోగ్యం, సామాజిక భద్రతపై అధికంగా కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఆయా అంశాలకు అనుగుణంగా మధ్య కాలానికి ద్రవ్య వ్యవస్థ–వ్యయ ప్రక్రియలను పునఃసమీక్షించాల్సి ఉంటుంది. అయితే క్లిష్ట ద్రవ్య పరిస్థితుల్లోనూ కేంద్రం తన వంతు తగిన చర్యలను సమర్థవంతంగా తీసుకుంటోంది.   
► అసలే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను కరోనా మహమ్మారి మరింత దెబ్బతీసింది.  పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపాధి అవకాశాలను కోల్పోయారు. దీనితో పేదరికం సమస్య తీవ్రమవుతోంది. ఏడాదిలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య 33 శాతం పెరిగే అవకాశం ఉంది.  
► బ్యాంకింగ్‌లో పెరుగుతున్న మొండిబకాయిల (ఎన్‌పీఏ) పరిమాణం ఆందోళన కలిగిస్తోంది.  

అన్ని అంచనాలూ క్షీణతలోనే...
మొదటి త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో భారత్‌ ఆర్థిక వ్యవస్థ 23.9% క్షీణ రేటును నమోదుచేసుకున్న నేపథ్యంలో... 2020–21లో  అంచనాలను పరిశీలిస్తే (అంచనాలు శాతాల్లో)..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top