దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జాతీయ గృహ ఆదాయ సర్వే (NHIS) నిర్వహించనున్నట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) ప్రకటించింది. 2026 ఏప్రిల్ నుంచి 2027 మార్చి వరకు ఏడాది పాటు ఈ భారీ సర్వే ప్రక్రియ కొనసాగనుంది.
రుజువు-ఆధారిత విధాన రూపకల్పనే లక్ష్యం
గణాంక విశ్లేషణలో ఇప్పటివరకు ఉన్న లోటుపాట్లను భర్తీ చేస్తూ, వాస్తవిక డేటా ఆధారంగా ప్రభుత్వ పథకాలను రూపొందించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశం. ‘రుజువు-ఆధారిత విధాన రూపకల్పనను బలోపేతం చేసేందుకు, ప్రజల వాస్తవ ఆదాయాలను లెక్కించేందుకు ఈ సర్వే చేపడుతున్నాం’ అని మంత్రిత్వ శాఖ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.
సర్వే ఎలా చేస్తారంటే..
నమూనా సేకరణ శాస్త్రీయ పద్ధతిలో చేస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల కుటుంబాలను ఎంపిక చేసి సమాచారాన్ని సేకరిస్తారు. ప్రజల జీవన ప్రమాణాలు, ఆదాయ వనరులు, ఖర్చు చేసే విధానాలపై ఈ సర్వే ద్వారా సమగ్ర విశ్లేషణ చేస్తారు. వినియోగదారుల ధరల సూచిక (CPI) సవరణకు, జాతీయ ఖాతాల తయారీకి, పేదరిక నిర్మూలన విశ్లేషణకు ఈ డేటా వెన్నెముకగా నిలుస్తుంది. ‘గృహ ఆదాయాలను నేరుగా సర్వే చేయడం ద్వారా ఆదాయ అసమానతలు, ఉత్పత్తి వనరుల మధ్య ఉన్న వ్యత్యాసాలను లోతుగా విశ్లేషించే అవకాశం కలుగుతుంది’ అని మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రపంచ దేశాల సరసన భారత్
ఇప్పటికే అమెరికా, బ్రిటన్, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు మన పొరుగు దేశాలైన చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా గృహ ఆదాయ డేటాను సేకరిస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఈ విభాగంలో చేరడం ద్వారా ఆర్థిక గణాంకాలలో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోనుంది.
ఇప్పటికే ముగిసిన 'ప్రీ-టెస్టింగ్'
ఈ ప్రతిష్టాత్మక సర్వే కోసం ఐఎంఎఫ్ (IMF) మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుర్జిత్ భల్లా నేతృత్వంలో నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు, సర్వే ప్రశ్నావళి సామర్థ్యాన్ని పరీక్షించడానికి 2025 ఆగస్టు 4 నుండి 8 వరకు ముందస్తు పరీక్షలు (Pre-testing) నిర్వహించారు.
హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు సహా 15 ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో ఈ ట్రయల్స్ జరిగాయి. ధనిక, పేద వర్గాలను కవర్ చేసేలా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ క్షేత్రస్థాయి కసరత్తులు పూర్తి చేశారు. ప్రభుత్వం చేపట్టబోయే ఈ సరికొత్త సర్వే ద్వారా సామాజిక-ఆర్థిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!
NSO, MoSPI is undertaking India’s first National Household Income Survey (NHIS) from April 2026 to March 2027, capturing income to strengthen evidence-based policy formulation.
Visit MoSPI’s official website for related updates and official information: https://t.co/V2xm331pY2… pic.twitter.com/1mmaukq88v— Ministry of Statistics & Programme Implementation (@GoIStats) April 17, 2026


