పండుగ పసిడి.. తిరుగులేని రాబడి! | Gold on Akshaya Tritiya Unstoppable Rise 9 years of strong returns | Sakshi
Sakshi News home page

పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!

Apr 16 2026 9:28 PM | Updated on Apr 16 2026 9:33 PM

Gold on Akshaya Tritiya Unstoppable Rise 9 years of strong returns

భారతీయ సంస్కృతిలో అక్షయ తృతీయకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పవిత్ర దినాన పసిడిని కొనుగోలు చేయడం అదృష్టాన్ని, శాశ్వత సంపదను తెస్తుందని కోట్లాది మంది నమ్ముతారు. అయితే, ఈ సంప్రదాయం వెనుక బలమైన ఆర్థిక ప్రయోజనం కూడా దాగి ఉందని గత తొమ్మిదేళ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం సెంటిమెంట్‌తోనే కాకుండా, లాభదాయకమైన పెట్టుబడి వ్యూహంగా కూడా బంగారం తన సత్తాను చాటుతోంది. ముఖ్యంగా గత తొమ్మిదేళ్ల కాలంలో పసిడి సుమారు రూ. 29,000 నుండి రూ. 1,54,000 స్థాయికి చేరుకుని, పెట్టుబడిదారులకు ఏకంగా 435 శాతం భారీ రాబడిని అందించింది.

12 ఏళ్లలో అక్షయ తృతీయ రాబడులు ఇలా..
గత 12 ఏళ్ల అక్షయ తృతీయ బంగారం రాబడులను పరిశీలిస్తే,  2015లో 11 శాతం, 2017లో 3 శాతం తగ్గుదలతో కొంత నిరాశపరిచినప్పటికీ, ఆ తర్వాత నుండి పసిడి ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా 2020లో 47 శాతం భారీ రాబడిని అందించిన బంగారం, ఈ ఏడాది (2026) ఏకంగా 60 శాతం వృద్ధిని నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 2023లో 18 శాతం, 2024లో 22 శాతం, 2025లో 31 శాతంగా ఉన్న రాబడులు, ప్రతి ఏడాది రెట్టింపు ఉత్సాహంతో పెరుగుతూ పసిడిపై పెట్టుబడి అత్యంత లాభదాయకమని మరోసారి నిరూపించాయి.

ఏడాదిలో 60 శాతం పెరుగుదల
గత ఏడాది కాలంలో బంగారం చూపిన జోరు ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. 2025 అక్షయ తృతీయ (ఏప్రిల్ 30) నాటి ధరలతో పోలిస్తే, ప్రస్తుతం పసిడి ధరలు 60 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గోల్డ్ మార్కెట్‌కు గతేడాది అండగా నిలిచాయి. పెట్టుబడిదారులకు వరుసగా తొమ్మిదో ఏడాది కూడా ఘనమైన లాభాలను అందిస్తూ, సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారం తన పట్టును నిలుపుకుంది. ధంతేరాస్‌తో పాటు అక్షయ తృతీయ భారతీయులకు అతిపెద్ద కొనుగోలు పండుగగా కొనసాగుతోంది.

2026 సంవత్సరం బంగారం కొనుగోలుదారులకు కొంత గందరగోళంగా ప్రారంభమైనప్పటికీ, బులియన్ మార్కెట్ భవిష్యత్తు మాత్రం ఆశాజనకంగానే కనిపిస్తోంది. ఇటీవల యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మార్చి గరిష్టాల నుండి ధరలు 10 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై జాప్యం వంటి కారణాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. అయినప్పటికీ, ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం 15 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ధరల్లో వచ్చిన ఈ తాత్కాలిక తగ్గుదల (పుల్ బ్యాక్) కొనుగోలుదారులకు ఒక మంచి అవకాశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మళ్లీ వచ్చే పండుగకి రూ.1.80 లక్షలు!
మున్ముందు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ఎదురయ్యే ఆటంకాలు పసిడి ధరలో పదునైన పెరుగుదలకు దారితీస్తాయని, ఏడాది కాలంలోనే తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.1,80,000 మార్కును తాకవచ్చని నిర్మల్ బాంగ్ కమోడిటీస్ రీసెర్చ్ హెడ్ కునాల్ షా విశ్లేషించారు. అదేవిధంగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు ధర 5,500 డాలర్ల స్థాయికి చేరవచ్చని, తద్వారా దేశీయంగా ధరలు రూ.1,70,000 నుండి రూ. 1,85,000 మధ్య ఉండొచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ నిపుణులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement