
ఇల్లు కట్టుకోవడం చాలా మంది కల. ప్రాథమికంగా ఇది సరైన ప్లాట్‌ను, సరైన ప్రదేశంలో ఎంచుకోవడంతో ప్రారంభమవువుతుంది. అందుకు ఎంపిక చేసుకునే ప్లాట్ నాణ్యత, భవిష్యత్తులో ఆ ఆస్తి విలువ పెరుగుదల, సమీపంలోని మౌలిక సదుపాయాలు వంటివి ఎంతో ప్రభావితం చేస్తాయి. ఎలాంటి సదుపాయాలు లేని ప్రదేశంలో తక్కువ ధరకు ప్లాట్ లభిస్తుంది కదా అని తొందరపడి కొనుగోలు చేశారంటే తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మంచి ప్లాట్‌ను ఎన్నుకునేటప్పుడు పరిగణించవలసిన కీలక అంశాలను కింద తెలుసుకుందాం.
ప్రదేశం
కొనుగోలు చేయాల్సిన ప్లాట్ పని ప్రదేశానికి లేదా వ్యాపార కేంద్రాలకు దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ప్రధాన రహదారులు లేదా ప్రజా రవాణా ద్వారా సులువుగా ప్రయాణించే వీలుండాలి. భద్రత పరంగా మెరుగైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. భవిష్యత్తులో వాణిజ్యంగా, ఇతర పరామితుల దృష్ట్యా అభివృద్ధి చెందే అవకాశం ఉండాలి.
మౌలిక సదుపాయాల లభ్యత
హైటెక్ ఇల్లు కట్టుకున్నా అత్యవసర సేవల విషయంలో రాజీ పడడం సరికాదు. కనీస మౌలిక సదుపాయాలు ముఖ్యం. విద్యుత్తు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థలు, ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ, వీధి దీపాలు, రవాణా సదుపాయాలు ఉండేలా చూసుకోవాలి.
అత్యవసర సేవలు
ముఖ్యంగా విద్య, వైద్యం వంటి కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలి. కొనుగోలు చేయాలనుకునే ప్లాట్‌కు 2-5 కిలోమీటర్ల లోపు పాఠశాలలు ఉండేలా చూసుకోవాలి. సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, క్లినిక్ లేదా ఆసుపత్రి ఉండడం చాలా అవసరం. ఫార్మసీలు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు ఉండేలా తనిఖీ చేసుకోవాలి. ప్లాట్‌కు 5-10 కిలోమీటర్ల పరిధిలో 24/7 ఎమర్జెన్సీ కేర్ యూనిట్ ఉండటం కీలకం. అత్యవసర సమయాల్లో పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలకు దగ్గరగా ఉండటం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు.
భూమి నాణ్యత
ప్లాట్ కొనుగోలు చేయడానికి ముందు నేల నాణ్యత, స్థలాకృతిని అంచనా వేయాలి. ఇవి నిర్మాణ వ్యయాన్ని, భద్రతను ప్రభావితం చేస్తాయి. నీరు నిలవకుండా ఉండటానికి డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉందనేది పరిశీలించాలి. తప్పకుండా భూసార పరీక్షలు చేసి నిపుణుల సలహా మేరకు నిర్మాణం ప్రారంభించాలి.
పరిసరాలు, సమాజం
ఇల్లు అంటే కేవలం ఒక భవనం మాత్రమే కాదు. ఇక్కడే మీ జీవితం సాగుతుంది. చుట్టూ పార్కులు, ఆటస్థలాలు ఉండేలా గమనించాలి. కమ్యూనిటీ కల్చర్ (ఫ్యామిలీ ఫ్రెండ్లీ) ఎలా ఉందో గమనించి, అవసరమైతే సమీపంలోని వారితో మాట్లాడి ప్లాట్ కొనుగోలు చేయాలి.
ఇదీ చదవండి: చిటికేసినంత సులువుగా ఇల్లు కొనేస్తున్నారు..