లాటరీలో డబ్బులు గెలిస్తే? ట్యాక్స్ ఎంత కట్టాలో తెలుసా?

how much tax is deducted from lottery winnings in india - Sakshi

నేను ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాను. వచ్చే నెల ఇండియా వస్తాను. నాతో బాటు 10,000 డాలర్లు తెచ్చుకోవచ్చా. ఇంకేదైనా మార్గం ఉందా? 
- కోనేరు రంగారావు, వర్జీనియా (ఈమెయిల్‌ ద్వారా) 

గతంలో ఎన్నోసార్లు మనం ఈ విషయం ప్రస్తావించాం. మీరు ఇండియా వస్తున్నప్పుడు అంత పెద్ద మొత్తం డాలర్ల కరెన్సీ నోట్లను మీతో పాటు తేకూడదు. తెస్తే రిస్క్‌. చట్టరీత్యా నేరం. నిషేధం. ఇంత పెద్ద వ్యవహారాన్ని ‘హవాలా’గా పరిగణించే అవకాశం ఉంది. అలా తేకండి. రాచమార్గం ఉండగా వేరే మార్గం ఎందుకు? మీరు వచ్చే ముందు, లేకపోతే వచ్చిన తర్వాత .. అక్కడున్న మీ అబ్బాయి/అమ్మాయి అకౌంటు నుండి ఇండియాలోని మీ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకోండి. ఇలా పంపబడిన మొత్తం.. అమెరికాలో పన్నుభారానికి గురి అయినదై ఉంటుంది. కాబట్టి ఎటువంటి సమస్యా ఉండదు. 

ఇక్కడ మీ అకౌంటులోకి జమ అవుతుంది. పంపే వ్యక్తి వివరాలన్నీ మీ ఇన్‌కం ట్యాక్స్‌ ఫైల్‌లో భద్రపర్చుకోండి. పేరు, చిరునామా, పాస్‌పోర్ట్‌ కాపీ, బ్యాంకు ఖాతా వివరాలు, మొత్తం, బదిలీ వివరాలు వీటితో పాటు ఒక ఈమెయిల్‌ తెప్పించుకోండి. మీరు ఇటునుంచి ఆ మేరకు అక్నాలెడ్జ్‌మెంట్‌ ఇవ్వండి. ఇక మీ విషయానికొస్తే ఇంత మొత్తం జమ అవ్వడమనేది, బ్యాంకు అధికారుల దృష్టిలో పడుతుంది. ఏ అధికారి దృష్టిలో పడినా మీ దగ్గర పూర్తి వివరణ ఉండాలి.

ఈ వ్యవహారం వల్ల గానీ, జమ వల్ల గానీ ఎటువంటి పన్నుభారం ఉండదు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ సందర్భంలో మీరు అక్కడ సంపాదించిన మొత్తం గానీ, మీ పిల్లలు సంపాదించిన మొత్తం గానీ ఇండియా వస్తోందని అనుకుంటున్నాం. కుటుంబ సభ్యులు ఇచ్చిన గిఫ్ట్‌కి ఎటువంటి పన్నుభారం ఉండదు. కుటుంబ సభ్యులు కాకపోతే ఈ వ్యవహారాన్ని అప్పుగా పరిగణించాలి. అలా కాకపోతే ఆదాయం అవుతుంది. ఏ వ్యవహారానికయినా సరైన డాక్యుమెంట్లు ఉండాలి.  

నేను ఈ మధ్యే రైల్వే శాఖలో నుంచి రిటైర్‌ అయ్యాను. ఆ సందర్భంలో సుమారు రూ.50,00,000 వచ్చింది. దీని మీద పన్ను భారం ఉంటుందా? 
- నండూరి సత్యవతి, హైదరాబాదు 

సాధారణంగా ప్రభుత్వ సర్వీసు నుండి రిటైర్‌ అయిన వారికి పదవీ విరమణ సందర్భంలో వచ్చిన పెన్షన్‌ ప్రయోజనాల మీద ఎటువంటి పన్నుభారం ఉండదు. సెక్షన్‌ 10 ప్రకారం వీటన్నింటి మీద మినహాయింపు ఉంది. అయితే, రిటర్ను వేసేటప్పుడు, రిటర్నులో ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో ఈ వివరాలు రాయండి. ఇలా రాయడం వల్ల మున్ముందు ‘సోర్స్‌’ వివరణలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు.  

లాటరీల మీద ఆదాయాన్ని ఎలా ట్రీట్‌ చేస్తారు?
- ఎం. ఉపేంద్ర, నిజామాబాద్‌
 

ముందుగా లాటరీల మీద ఆదాయాన్ని/ప్రైజ్‌ మొత్తాన్ని ఆదాయంగా భావిస్తారు. ఇతర ఆదాయం కింద వర్గీకరిస్తారు. ఈ ఆదాయం మీద విధిగా టీడీఎస్‌ చేస్తారు. దీనిపై 30 శాతం మేర భారం పడుతుంది. విద్యా సుంకం అదనం. పైగా ఎటువంటి బేసిక్‌ లిమిట్‌ మినహాయింపు ఉండదు. మొత్తం లాటరీని ఆదాయంగా భావించి, 30 శాతం ప్రకారం పన్ను వేస్తారు. ఈ భారంలో నుంచి టీడీఎస్‌ను తగ్గించి, పన్ను చెల్లించాలి. 
  
కె.సీహెచ్.ఎ.వీ.ఎస్. ఎన్ మూర్తి, కె.వి.ఎన్‌ లావణ్య - ట్యాక్సేషన్‌ నిపుణులు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top