
జీఎస్టీ సంస్కరణలు రేపటి (సెప్టెంబర్ 22) నుంచే అమలులోకి రానున్నాయి. దీంతో వంటగదిలో ఉపయోగించే వస్తువుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, మందుల (మెడిసిన్స్) దగ్గర నుంచి ఆటోమొబైల్స్ వరకు చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. వినియోగదారులకు వరంలాగా.. జీఎస్టీ కౌన్సిల్.. నవరాత్రి మొదటి రోజు నుంచి రేట్లను తగ్గించాలని నిర్ణయించింది.
రేపటి నుంచి ధరలు తగ్గనున్న వస్తువుల జాబితాలో నెయ్యి, పనీర్, వెన్న, నామ్‌కీన్, కెచప్, జామ్, డ్రై ఫ్రూట్స్, కాఫీ, ఐస్ క్రీములు వంటివాటితో పాటు.. టీవీ, ఏసీ, వాషింగ్ మెషీన్స్ కూడా ఉన్నాయి.

ఔషధాలు, గ్లూకోమీటర్లు, డయాగోనిస్టిక్ కిట్‌ల ధరలు తగ్గనున్నాయి. సిమెంట్ 18 శాతం జీఎస్టీ పరిధిలోకి రావడంతో.. గృహనిర్మాణదారులు ప్రయోజనం పొందుతారు. GST తగ్గింపు ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఫార్మసీలు తమ MRPని సవరించాలని లేదా తక్కువ రేటుకు మందులను విక్రయించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

జీఎస్టీ రేటు తగ్గింపు వల్ల.. ఆటోమొబైల్ కొనుగోలుదారులు లాభపడతారు.ఇప్పటికి దాదాపు అన్ని కార్ల కంపెనీలు తగ్గిన ధరలను వెల్లడించాయి. ఇవి రేపటి నుంచే అమలులోకి రానున్నాయి. జీఎస్టీ సంస్కరణలు మాత్రమే కాకుండా.. ఫెస్టివల్ ఆఫర్స్ లేదా బెనిఫిట్స్ కూడా ఇప్పుడు వాహన కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా మారనున్నాయి.
హెయిర్ ఆయిల్, టాయిలెట్ సబ్బు బార్లు, షాంపూలు, టూత్ బ్రష్, టూత్ పేస్టు, టాల్కమ్ పౌడర్, ఫేస్ పౌడర్, షేవింగ్ క్రీమ్, ఆఫ్టర్-షేవ్ లోషన్ వంటి ఇతర రోజువారీ వినియోగ వస్తువుల ట్యాక్స్ తగ్గడంతో.. ధరలు మరింత చౌకగా మారనున్నాయి.
ఇదీ చదవండి: తిరిగి వచ్చేయండి.. భయంతో జీవించవద్దు: శ్రీధర్ వెంబు