విమానాశ్రయాల్లో వాటాల విక్రయం! 

Govt Sell Remaining Stake In Delhi, Mumbai, Bangalore, Hyderabad Airports - Sakshi

జాబితాలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ 

వచ్చే ఏడాదిలో 13 ఎయిర్‌పోర్టుల ప్రయివేటీకరణ 

న్యూఢిల్లీ: ఇప్పటికే ప్రయివేటైజ్‌ చేసిన విమానాశ్రయాల్లో ప్రభుత్వానికి మిగిలిన వాటాలను విక్రయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జాబితాలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నాలుగు విమానాశ్రయాలలో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ(ఏఏఐ)కున్న వాటాలను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశాయి. అంతేకాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం(2021–22)లో మరో 13 ఎయిర్‌పోర్టులను ప్రయివేటైజ్‌ చేసే ప్రణాళికల్లో ప్రభుత్వమున్నట్లు వివరించాయి. ఆస్తుల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 2.5 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని చూస్తున్న విషయం విదితమే. గత నెలలో అత్యున్నత కార్యదర్శుల కమిటీ ఈ మేరకు ప్రణాళికలు వసినట్లు తెలుస్తోంది. 

రానున్న రోజుల్లో 
నాలుగు ఎయిర్‌పోర్టుల భాగస్వామ్య సంస్థ(జేవీ)లలో ఏఏఐకుగల వాటాల విక్రయంపై పౌర విమానయాన శాఖ తగిన అనుమతులను పొందనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. రానున్న కొద్ది రోజుల్లో అనుమతుల అంశం కేబినెట్‌కు చేరనున్నట్లు తెలియజేశాయి. కాగా.. వచ్చే ఏడాదిలో ప్రయివేటైజ్‌ చేయనున్న జాబితాలోని లాభదాయకం, లాభదాయకంకాని 13 ఎయిర్‌పోర్టులను మిక్స్‌ చేయడం ద్వారా ఆకర్షణీయమైన ప్యాకేజీకి మార్గమేర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి రౌండ్‌ ప్రయివేటైజేషన్‌లో భాగంగా అదానీ గ్రూప్‌ లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఏఏఐ నిర్వహణలో దేశవ్యాప్తంగా 100కుపైగా విమానాశ్రయాలున్నాయి. 

వివరాలివీ 
►నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలలో వివిధ సంస్థలకున్న వివరాలు ఎలా ఉన్నాయంటే.. ముంబై ఎయిర్‌పోర్టులో అదానీ గ్రూప్‌ 74 శాతం వాటాను కలిగి ఉంది. ఏఏఐకు 26 శాతం వాటా ఉంది. 
►ఢిల్లీ విమానాశ్రయంలో జీఎంఆర్‌ గ్రూప్‌ వాటా 54 శాతంకాగా.. ఏఏఐ 26 శాతం వాటాను పొందింది. ఫ్రాపోర్ట్, ఎరమన్‌ మలేషియా 10 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నాయి. 
►హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతోపాటు, ఏఏఐ 26 శాతం వాటాను పొందాయి. ఇదేవిధంగా కర్ణాటక ప్రభుత్వంతో కలసి బెంగళూరు ఎయిర్‌పోర్టులోనూ వాటాను కలిగి ఉంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top