
ఇప్పటివరకు కార్లకు మాత్రమే న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (NCAP) ద్వారా సేఫ్టీ రేటింగ్ అందించేవారు. అయితే ఈ-రిక్షాలకు భద్రతా ప్రమాణాలను అందించడానికి ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా చర్యలను పెంపొందించడానికి ఈ చర్యను చేపడుతున్నట్లు ఆయన వివరించారు.
ఎఫ్ఐసీసీఐ రోడ్డు భద్రతా అవార్డులు & సింపోజియం 7వ ఎడిషన్ కార్యక్రమంలో, మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి రోడ్డు భద్రత ఒక ముఖ్యమైన అంశం అని అన్నారు. దేశంలో ఏటా దాదాపు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇందులో 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ 1.8 లక్షల మరణాలలో.. దాదాపు 66.4 శాతం మంది 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు వారే అని ఆయన పేర్కొన్నారు.
ఈ-రిక్షాల సంఖ్య భారతదేశంలో ఎక్కువవుతున్నాయి. ఈ తరుణంలో భారత్ ఎన్‌సీఏపీ లాంటి ప్రమాణాలు తీసుకురావలసిన అవసరం ఉంది. ఇది భద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని నితిన్ గడ్కరీ వివరించారు. 2023లో భారత్ ఎన్‌సీఏపీ ప్రారంభమైంది. ఇది వాహనాల భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.
రోడ్డు ప్రమాదాలపై మరింత మాట్లాడుతూ.. హెల్మెట్లు ఉపయోగించకపోవడం వల్లే దాదాపు 30,000 మరణాలు సంభవిస్తున్నాయని, సీటు బెల్టులు ఉపయోగించకపోవడం వల్లే 16,000 మరణాలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రమాదాలకు కారణాన్ని కనుగొనడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో భద్రతా ఆడిట్‌లు నిర్వహిస్తున్నట్లు గడ్కరీ అన్నారు.
ఇదీ చదవండి: ఈ కార్ల ధరలు రూ. 50వేలు తగ్గే అవకాశం..
రోడ్డు ప్రమాదాల గురించి
రోడ్డు ప్రమాదం ఒక సామాజిక సమస్య. ఇతర రంగాలలో మనం విజయాలను సాధించాము. కానీ రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో మాత్రం విజయం సాధించలేకపోతున్నామని గడ్కరీ అన్నారు. ఒకవేళా ప్రమాదాలు జరిగినప్పుడు.. ప్రమాద బాధితులను వెంటనే ఆసుపత్రులకు తీసుకెళ్లాలని ప్రజలను కోరారు, ఎందుకంటే ముందస్తు చికిత్స దాదాపు 50,000 మంది ప్రాణాలను కాపాడుతుందని అన్నారు.