
పరిశ్రమ పరిరక్షణకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్
న్యూఢిల్లీ: ఎగుమతులకి, దేశీయంగా వినియోగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం త్వరలోనే పలు చర్యలు ప్రకటించనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. ఇతర దేశాల ఏకపక్ష నిర్ణయాల వల్ల ప్రతికూల ప్రభావాలు పడకుండా పరిశ్రమను పరిరక్షించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. భారత ఎగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అధిక టారిఫ్‌ల వల్ల కారి్మక శక్తి ఎక్కువగా ఉండే రసాయనాలు, రొయ్యలు, తోలు, పాదరక్షల్లాంటి పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన నెలకొంది. వస్తు సేవల పన్నుల (జీఎస్‌టీ) సంస్కరణలతో దేశీయంగా తయారీ రంగానికి మరింత ఊతం లభిస్తుందని పరిశ్రమ వర్గాల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గోయల్ చెప్పారు. వచ్చే వారమే జీఎస్‌టీ కౌన్సిల్ భేటీ కానుండటంతో ఈ ప్రభావాలు త్వరలోనే కనిపిస్తాయని మంత్రి తెలిపారు.
ిమాండ్ సత్వరం పెరిగేందుకు, దేశీయంగా తయారీకి బూస్ట్‌నిచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను జీఎస్‌టీ మండలి సమావేశంలో పరిశీలించనున్నట్లు వివరించారు. ‘ఎవరైనా సరే, సరైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలంటే మనం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం.
కానీ, మనపై వివక్ష చూపేందుకు ప్రయతి్నస్తే మాత్రం.. ఆత్మ విశ్వాసం, ఆత్మగౌరవం గల 40 కోట్ల మంది భారతీయులు ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గరు.. బలహీనపడరు. అంతా కలిసికట్టుగా ముందుకు సాగుతాం. కొత్త మార్కెట్లను అందిపుచ్చుకుంటాం. గతేడాది కన్నా ఈసారి మన ఎగుమతులు మరింతగా పెరుగుతాయని ధీమాగా చెబుతున్నాను‘ అని మంత్రి తెలిపారు. దిగుమతుల ఆధారిత దేశమైన భారత్ గతంలో కోవిడ్–19 మహమ్మారి, అణ్వాయుధపరమైన ఆంక్షలులాంటి ఎన్నో సవాళ్లను అధిగమించిందని చెప్పారు.
ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి..
ప్రత్యామ్నాయ మార్కెట్లలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెడుతున్నామని మంత్రి వివరించారు. భారీ సుంకాలతో అంతర్జాతీయంగా ఏర్పడిన అనిశి్చతులను అధిగమించడంలో ఎగుమతిదార్లకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని గోయల్ చెప్పారు. ఆస్ట్రేలియాతో ఆర్థిక, సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యాలను కుదుర్చుకునేందుకు అవకాశాలు ఉన్నాయని, భారతీయ వ్యాపార సంస్థలు, వర్కర్లు, నిపుణులు వీటిని అందిపుచ్చుకోవాలని సూచించారు.