పసిడి, వెండి- 2 వారాల గరిష్టం | Gold price hits 2 week high in New York Comex | Sakshi
Sakshi News home page

పసిడి, వెండి- 2 వారాల గరిష్టం

Dec 8 2020 10:21 AM | Updated on Dec 8 2020 10:33 AM

Gold price hits 2 week high in New York Comex  - Sakshi

న్యూయార్క్/ ముంబై: కొద్ది రోజుల కన్సాలిడేషన్‌ తదుపరి మళ్లీ బంగారం ధరలు మెరుస్తున్నాయి. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ట్రంప్‌ ప్రభుత్వం చైనాతో వాణిజ్య వివాదాలకు మళ్లీ తెరతీయనున్న వార్తలు పసిడికి డిమాండ్‌ను పెంచినట్లు నిపుణులు పేర్కొన్నారు. ట్రంప్‌ ప్రభుత్వం తాజాగా  12 మంది చైనా వ్యక్తులపై ఆంక్షలు విధించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. జనవరిలో ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్‌పై ఈ నిర్ణయాలు ప్రభావం చూపే వీలున్నట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మరోపక్క కోవిడ్‌-19 కట్టడికి బైడెన్‌ ప్రభుత్వం సహాయక ప్యాకేజీలకు మద్దతు పలుకుతున్న విషయం విదితమే. దీనికితోడు తాజాగా జపాన్‌ ప్రభుత్వం సైతం 708 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి సన్నాహాలు చేస్తున్నట్లు వెలువడిన వార్తలు రెండు రోజులుగా పసిడి, వెండి ధరలకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1874 డాలర్లను తాకగా.. దేశీయంగా ఎంసీఎక్స్లో 10 గ్రాముల పసిడి రూ. 50,000 మార్క్‌ దాటింది.  దేశ, విదేశీ మార్కెట్లో నేటి ట్రేడింగ్‌ వివరాలు ఇలా.. 

హుషారుగా..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 192 పెరిగి రూ. 50,138 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,175 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,045 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్‌ సైతం స్వల్పంగా రూ. 67 బలపడి రూ. 65,566 వద్ద కదులుతోంది. తొలుత రూ. 65,666 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 65,363 వరకూ వెనకడుగు వేసింది. 

లాభాలతో..
న్యూయార్క్‌ కామెక్స్‌లో వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు బలపడ్డాయి. ప్రస్తుతం పసిడి ఔన్స్‌(31.1 గ్రాములు) 0.45 శాతం పుంజుకుని 1,874 డాలర్లకు చేరింది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.4 శాతం లాభంతో 1,870 డాలర్లను అధిగమించింది. వెండి సైతం 0.2 శాతం లాభంతో ఔన్స్ 24.84 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్‌ ధరలు. నవంబర్‌ 23 తదుపరి ఇవి గరిష్ట ధరలుకావడం గమనార్హం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement